అందుబాటులో ఉండరు.. తలుపులు తీయరు!
అనంతపురం సెంట్రల్: ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా తూనికలు, కొలతల్లో తేడాలు కనిపిస్తున్నాయి. ఇటీవల అనంతపురంలోని సోముల దొడ్డి, గుత్తి రోడ్డులోని పెట్రోల్ బంకుల్లో అక్రమాలు బయటపడ్డాయి. వెలుగు చూస్తున్నవి కొన్నే అయితే బయటకురాని మోసాలు అనేకం ఉన్నాయి. తమకు ఇబ్బంది కలిగినప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక చాలా మంది మిన్నకుండిపోతున్నారు. మోసాలు అరికట్టేందుకు ప్రత్యేకంగా తూనికలు, కొలతల శాఖ ఉంది. అయితే, చాలా మందికి జిల్లా కేంద్రంలో ఈ కార్యాలయం ఎక్కడుందో కూడా తెలియడం లేదు.
దొరకని చిరునామా..
వినియోగదారులు మోసపోకుండా చర్యలు తీసుకోవడంలో లీగల్ మెట్రాలజీ(తూనికలు, కొలతలు)శాఖ కీలకం. అలాంటి శాఖ కార్యాలయం ఎక్కడుందో చాలా మందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. పరిశోధన చేస్తే తప్ప కార్యాలయం చిరునామా దొరకని పరిస్థితి! జాతీయ రహదారిలోని డీమార్ట్ వెనుక గౌరవ హోమ్స్‌లో ఓ నివాసంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కనీసం జాతీయ రహదారి సమీపంలో కార్యాలయ చిరునామా బోర్డు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా ఇక్కడ ఒక కార్యాలయం ఉందనే విషయం స్థానికులకూ తెలియడం లేదు. కార్యాలయంలో సిబ్బంది కొరత కూడా ఉంది. అసిస్టెంట్ కంట్రోలర్ కార్యాలయంలో కేవలం ఒక సీనియర్ అసిస్టెంట్ ఉంటున్నారు.
ఎప్పుడు తెరుస్తారో...?
తూనికలు, కొలతల శాఖ కార్యాలయ తలుపులు తీయడమే గగనంలా మారింది. ఉమ్మడి జిల్లా బాస్ అసిస్టెంట్ కంట్రోలర్ (ఏసీ) ఎక్కువ శాతం క్యాంపులు, మీటింగ్‌లకే పరిమితమవుతున్నారు. ఇక ఇన్‌స్పెక్టర్ కార్యాలయ తలుపులు ఎప్పుడు తీస్తారో తెలియడం లేదు. ఎప్పుడు చూసినా తాళాలు వేసే ఉంటున్నాయి. శుక్రవారం కూడా కార్యాలయానికి వేసిన తాళం తీయలేదు. దీనిపై ఇన్‌స్పెక్టర్ ఖాజాహుస్సేన్‌ను ఫోన్‌లో వివరణ కోరగా.. నగరంలో తనిఖీలు చేపడుతున్నట్లు ఆయన చెప్పడం గమనార్హం.
ఇదీ లీగల్ మెట్రాలజీ శాఖ తీరు
పరిశోధిస్తే తప్ప కానరాని చిరునామా
అవస్థలు పడి వెళ్లినా
ప్రయోజనం శూన్యం
ఎప్పుడూ కార్యాలయ తలుపులు మూతే


