నేటి నుంచి పోలీస్ స్పోర్ట్స్ మీట్
అనంతపురం సెంట్రల్: జిల్లా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌ను శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. గురువారం ఆయన తన చాంబర్‌లో క్రీడాకారులకు అవసరమైన దస్తులు, క్రీడా సామగ్రిని అందించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు జట్టు భావనను, క్రమ శిక్షణను పెంపొందిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా, డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, పలువురు సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
గంజాయి విక్రేతలకు
పదేళ్ల జైలు
అనంతపురం: గంజాయి సరఫరా, విక్రయ ముఠాలోని ఆరుగురు యువకులకు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు అనంతపురం జిల్లా మొదటి సెషన్స్ కోర్టు జడ్జి సత్యవాణి గురువారం సంచలన తీర్పు వెలువరించారు. 2021 జూన్ 17న అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఎంవైఆర్ ఫంక్షన్ హాలు దగ్గర ఎస్‌ఐ నబిరసూల్ వాహనాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో ఒక కారులో 29 కేజీల గంజాయి దొరింది. వీటిని తరలిస్తున్న అనంతపురానికి చెందిన కుంచపు వడ్డే పవన్‌కుమార్, గాజుల అఖిల్, ధనరాజ్, కళ్యాణదుర్గానికి చెందిన గాజుల నాగరాజు, శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కొండమనాయునిపాలెంకు చెందిన పూల సునీల్ కుమార్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పల్లె వెంకట రవితేజలను అరెస్ట్ చేశారు. వీరంతా 21 నుంచి 29 ఏళ్లలోపు వయసు కలిగిన యువకులే. అప్పటి సీఐ మురళీధర్‌రెడ్డి కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం అనంతపురం మొదటి అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టులో చార్జ్‌షీటు దాఖలు చేశారు. ఈ కేసులో నలుగురు సాక్షులను జడ్జి సత్యవాణి విచారించారు. నేరం రుజువు కావడంతో అనంతపురం, శ్రీసత్యసాయి, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన ఆరుగురు ముద్దాయిలకు పది సంవత్సరాల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ గురువారం తీర్చు చెప్పారు. స్పెషల్ పీపీ లేపాక్షి నాయుడు ప్రాసిక్యూషన్ తరఫున వాదించారు. సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుపరిచి, ముద్దాయిలకు శిక్ష పడేందుకు కృషి చేసిన పోలీసులను ఎస్పీ జగదీష్ అభినందించారు.
స్వీప్ నిధుల దుర్వినియోగం!
● శింగనమలకు రూ.6కోట్లతో ప్రాజెక్ట్
● నేడు అధికారికంగా ప్రారంభం
● ప్రారంభానికి ముందే రూ.15 లక్షల వ్యయం
శింగనమల: గ్రామీణ మహిళల స్వయం జీవనోపాధి కల్పన కోసం శింగనమల నియోజకవర్గానికి మంజూరైన స్టార్టప్ గ్రామీణ వ్యాపారోత్సాహ కార్యక్రమం (స్టార్టప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్–స్వీప్)లో ప్రారంభోత్సవానికి ముందే నిధులు దుర్వినియోగమయ్యాయి. నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల్లోని 2,400 మంది మహిళలకు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్థిరత్వం కల్పించడమే ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. మూడేళ్ల కిందట రూ.6 కోట్లతో మంజూరైన ఈ ప్రాజెక్టుకు కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు వెచ్చించనున్నాయి. మహిళలకు 50 పైసల వడ్డీకే రుణాలు మంజూరు చేయాల్సి ఉంది. అయితే వెలుగు సిబ్బంది మూడేళ్లుగా దీని గురించి పట్టించుకోలేదు. ఎట్టకేలకు శుక్రవారం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.15 లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. అయితే ఈ డబ్బు ఎందుకోసం వెచ్చించారో వెల్లడించకపోవడం గమనార్హం.
గుమ్మఘట్ట ఏపీఎంకు బాధ్యతలు
రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగుట్టలో పని చేస్తున్న రెగ్యులర్ ఏపీఎంను శింగనమల స్వీప్ ప్రాజెక్టుకు ఇన్‌చార్జ్‌గా నియమించారు. నియోజకవర్గంలోని శింగనమల, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల ఏపీఎంలను పర్యవేక్షణ చేయాలి. జిల్లాలో మారుమూలన పనిచేస్తున్న ఏపీఎంకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించడం వెనుక ఆంతర్యమేమిటోనని మహిళలు చర్చించుకుంటున్నారు.
నేటి నుంచి పోలీస్ స్పోర్ట్స్ మీట్


