మరోసారి నేలచూపు
● టమాట ధరలు భారీ పతనం
● నష్టాలతో రైతులు ఉక్కిరిబిక్కిరి
అనంతపురం అగ్రికల్చర్: రైతు ఇంట జాక్‌పాట్ పంటగా మారిన టమాట మళ్లీ నేలచూపు చూస్తోంది. జనవరి నెలంతా ఇదే పరిస్థితి నెలకొనడంతో ఇప్పటికే భారీ నష్టాలు మూటగట్టుకున్నారు. ఇప్పుడు మరింత కుదేలయ్యే పరిస్థితి నెలకొంది. గురువారం కక్కలపల్లి మార్కెట్‌లో టమాట కిలో రూ.5 నుంచి రూ.11 మధ్య క్రయ విక్రయాలు జరిగాయి. 15 కిలోల బాక్సు గరిష్టం రూ.165 పలకగా కనిష్టం రూ.75 ప్రకారం అమ్ముడుబోయాయి. ఇందులో గరిష్టం అనేది కొన్ని లాట్లు మాత్రమే విక్రయాలు జరగ్గా.. 70 నంచి 80 శాతం లాట్లు బాక్సు రూ.75 ప్రకారం పలకడం గమనార్హం. దీంతో పెట్టుబడి కాదు కదా... కాయ కోత, రవాణా, కమీషన్ల ఖర్చులు కూడా దక్కక రైతులు దిక్కులు చూస్తున్నారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఈ ఖరీఫ్, రబీలో జిల్లా వ్యాప్తంగా 40 వేల ఎకరాల భారీ విస్తీర్ణంలో టమాటా సాగులోకి వచ్చింది. చాలామంది రైతులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టమాటా సాగుపై దృష్టి సారించడంతో విస్తీర్ణం బాగా పెరిగింది. అయితే సీజన్ ఆరంభంలో అంటే గత జూన్, జూలై, ఆగస్టులో మార్కెట్ పరిస్థితి ఆశాజనకంగా ఉండటంతో కొంత లాభపడ్డారు. తర్వాత సెప్టెంబర్, అక్టోబర్‌లో మార్కెట్ పరిస్థితి తారుమారు కావడంతో మళ్లీ నష్టాలు చవిచూశారు. తిరిగి నవంబర్, డిసెంబర్‌లో పరిస్థితి కొంత మెరుగైంది. మళ్లీ జనవరి నెలంతా నష్టపోయారు. ఇపుడు ఫిబ్రవరిలో కూడా నష్టపోయే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. మచ్చ ఉన్నవి, నాసిరకం, చిన్నసైజు టమాటాలను కొనేవారు లేరని చెబుతున్నారు. కిలో రూ.20 పలికితే కానీ పెట్టుబడులు దక్కే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.
మరోసారి నేలచూపు


