లంచం ఎందుకివ్వాలంటూ.. ఆవులతో నిరసన | - | Sakshi
Sakshi News home page

లంచం ఎందుకివ్వాలంటూ.. ఆవులతో నిరసన

Feb 6 2026 7:43 AM | Updated on Feb 6 2026 7:43 AM

లంచం ఎందుకివ్వాలంటూ.. ఆవులతో నిరసన

లంచం ఎందుకివ్వాలంటూ.. ఆవులతో నిరసన

కళ్యాణదుర్గం రూరల్‌: పొలాలకు దారి చూపండంటే లంచం అడుగుతున్నారంటూ ఇద్దరు రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఏకంగా రెవెన్యూ డివిజన్‌ కార్యాలయ ఆవరణలోకి ఆవులను తోలుకొచ్చి కట్టేశారు. తమకు న్యాయం చేయండని విన్నవించారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కుందుర్పి మండలం మహంతపురం గ్రామానికి చెందిన రైతులు లింగన్న, రామాంజినేయులు తమ వ్యవసాయ పొలాల్లో పాడి పెంపకం కోసం షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. పెద్దవంకలోని రస్తా గుండా 50 ఏళ్లుగా వీరి పొలాలకు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే కుందుర్పి రెవెన్యూ కార్యాలయంలోని వీఆర్‌ఓ గోపాల్‌ సహకారంతో అతని బంధువులు, టీడీపీ సానుభూతిపరులు పెద్ద వంకలో రాకపోకలు నిలిపివేశారు. దీంతో పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు ఏర్పడటంతో రస్తా చూపించాలంటూ సదరు రైతులు తహసీల్దార్‌ కార్యాలయంలో అర్జీ అందజేశారు. విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు ‘మీకు న్యాయం చేస్తే.. మాకు ఏమిస్తారు’ అని అనడంతో రైతులు కంగుతిన్నారు. ‘మా భూముల్లోకి వెళ్లడానికి మేమెందుకు ఇవ్వాలి’ అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత పొలాల్లోకి వెళ్లే దారిలో జేసీబీతో మట్టిని అడ్డువేసేశారు. ఈ తతంగమంతా రెవెన్యూ అధికారులు, టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతోంది. రైతులు మరోమారు కార్యాలయానికి వెళ్లి అడిగితే సదరు అధికారి.. ‘మీరు ఎక్కడికి వెళ్లినా పని జరగదు. మేము అడిగినంత కాకుండా... ఎంత ఇస్తారో చెప్పండి’ అంటూ బేరమాడారు. న్యాయబద్ధంగా సమస్యను పరిష్కరించాల్సిన అధికారులే లంచం అడిగేసరికి ఏమిచేయాలో పాలుపోని రైతులు గురువారం కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయానికి ఆవులను తోలుకొచ్చారు. ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో ఆవులను అక్కడే ఒకచోట కట్టేశారు. పాడి ఆవులను పొలాల్లోకి తీసుకెళ్లడానికి దారి చూపండి లేదా వీటిని ఇక్కడే అయినా ఉంచుకోండి అంటూ నిరసన తెలిపారు. చివరకు రైతుల నుంచి అర్జీ స్వీకరించిన సిబ్బంది.. సమస్యను పరిష్కరిస్తామని తెలపడంతో రైతులు తమ ఆవులను తోలుకుని అక్కడి నుంచి వెనుదిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement