ఏసీబీ వలలో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి
● బిల్లుల మంజూరుకు వార్డెన్ నుంచిలంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం
● కేసు నమోదు చే సిన ఏసీబీ డీఎస్పీ
కదిరి టౌన్: శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి(ఏబీసీడబ్ల్యూఓ)గా పనిచేస్తున్న గుర్రం బాలాజీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. బకాయిల మంజూరు కోసం వార్డెన్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు..గాండ్లపెంట మండల కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్ వార్డెన్‌గా లక్ష్మినారాయణ పనిచేస్తున్నారు. హాస్టల్ నిర్వహణకు సంబంధించి ఈయనకు బిల్లులు రావాల్సి ఉంది. వీటిని మంజూరు చేయాలంటే రూ.18 వేలు లంచం ఇవ్వాలని ఏబీసీడబ్ల్యూఓ గుర్రం బాలాజీ డిమాండ్ చేశారు. చివరకు రూ.15 వేలకు ఒప్పుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని వార్డెన్ లక్ష్మినారాయణ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారు వల పన్ని పట్టుకోవడానికి ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగా వార్డెన్ గురువారం కదిరి పట్టణంలోని చైర్మన్ వీధిలో ఉన్న ఏబీసీడబ్ల్యూఓ నివాసానికి వెళ్లి.. ఆయనకు రూ.15 వేల నగదు అందజేశారు. ఇంతలోనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి బాలాజీని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈయనపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే 9440446182 నంబరుకు సమాచారం ఇవ్వాలన్నారు. దాడుల్లో డీఎస్పీతో పాటు సీఐ హమీద్‌ఖాన్, సిబ్బంది పాల్గొన్నారు.


