చెరువు మట్టి అక్రమ రవాణాను అడ్డుకున్న రైతులు
● ప్రశ్నించిన బాధితులకు బెదిరింపులు
● అధికారుల తీరుపై తోపుదుర్తి చందు మండిపాటు
రాప్తాడు రూరల్: అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎలాంటి అనుమతులు లేకుండా రాప్తాడు మండలం హంపాపురం చెరువు నుంచి అక్రమంగా సాగిస్తున్న జీడ (మట్టి) తరలింపును స్థానికులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన ఓ నాయకుడు కొన్ని రోజులుగా చెరువు మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. దీనికి నీటి పారుదల శాఖ అధికారుల నుంచి కానీ, రెవెన్యూ అధికారుల నుంచి కాని ఎలాంటి అనుమతులు పొందలేదు. పైగా గ్రామ పంచాయతీకి రాయల్టీ సైతం చెల్లించకుండా రోజూ పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా అక్రమంగా మట్టిని తరలిస్తున్నా అధికారులు స్పందించకపోవడంతో రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామ రైతులు తిరగబడ్డారు. దీంతో బుధవారం ఉదయం చెరువులోకి గ్రామస్తులు వెళ్లి మట్టి తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. ఊరి అవసరాలకు వినియోగించుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదని, అలాకాకుండా అమ్ముకోవడానికి ఎలా తరలిస్తారని నిలదీశారు. మట్టి తవ్వేందుకు ఉన్న అనుమతులు చూపించాలని అడిగారు. దీంతో మట్టి తరలింపును ఆపేశారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే మళ్లీ తరలింపులను కొనసాగించారు. సమాచారం అందుకున్న రైతులు సాయంత్రం వెళ్లి చెరువు నుంచి జాతీయరహదారికి వెళ్లే మార్గంలో టిప్పర్లను అడ్డుకుని అక్కడే రోడ్డుమీద అన్‌లోడ్ చేయించారు. అదే సమయంలో అడ్డుకున్న రైతులకు పోలీసులు ఫోన్ చేసి స్టేషన్‌కు రావాలంటూ హుకుం జారీ చేశారు. అనంతరం అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో తోటలకు నీరు పెట్టేందుకు వెళుతున్న కొందరు రైతులపై దాడులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో గురువారం సంతోష్, సుధాకర్, మోహన్ తదితరులు రాప్తాడు పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. తమపై అకారణంగా దాడి చేశారని, విచారించి చట్టపరంగా చర్యలు కోవాలని కోరారు.
మట్టిని అమ్ముకుంటుంటే పట్టించుకోరా?
సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి గురువారం సాయంత్రం రాప్తాడు తహసీల్దారు కార్యాలయానికి వెళ్లారు. తహసీల్దారు అందుబాటులో లేకపోవడంతో రెవెన్యూ అధికారితో మాట్లాడారు. బుక్కచెర్లలో అమ్మవారి దేవాలయం కోసం మట్టి తోలుకుంటుంటే కేసు నమోదు చేశారన్నారు. ఇప్పటికీ జేసీబీ స్టేషన్‌లోనే ఉందన్నారు. మరి హంపాపురంలో ఎలాంటి అనుమతులు లేకుండా నెలల తరబడి మట్టిని అక్రమంగా తరలిస్తున్నా కనీస చర్యలు ఎందుకు తీసుకోలేక పోతున్నారని నిలదీశారు. పార్టీలకు అతీతంగా రైతులు అడ్డుకున్నారన్నారు. జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు, ఉద్యోగులే సహజ వనరుల దోపిడీకి అడ్డుకట్ట వేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు గంగుల సుధీర్‌రెడ్డి, మామిళ్లపల్లి అమర్‌నాథ్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రామాంజనేయులు, పార్టీ మండల కన్వీనర్ సాకే వెంకటేష్, రాప్తాడు జయన్న, హంపాపురం కేశవరెడ్డి, మల్లికార్జున, శింగారప్ప, చిరుతల నాగేంద్ర, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ లక్ష్మన్న ఉన్నారు.
చెరువు మట్టి అక్రమ రవాణాను అడ్డుకున్న రైతులు


