మార్పులకనుగుణంగా బోధన సాగించాలి
● ఇంటర్ విద్య ఓఎస్‌డీ రమేష్
అనంతపురం సిటీ: ఇంటర్మీడియట్ విద్య, పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం నూతన సంస్కరణలను తీసుకువచ్చిందని, వీటికి అనుగుణంగా బోధనలో ముందుకు సాగాలని అధ్యాపకులకు ఇంటర్ విద్య ఓఎస్‌డీ రమేష్ సూచించారు. అనంతపురంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో డీవీఈఓ వెంకటరమణానాయక్ అధ్యక్షతన గురువారం ఏర్పాటు చేసిన సదస్సుకు ఆర్‌ఐఓ సురేష్‌బాబుతో కలసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 12 ఏళ్ల తరువాత ఇంటర్ విద్యలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. గణితంలో 1ఏ, 1బీ ఒకే సబ్జెక్టుగా మార్పు చేశారన్నారు. దీంతో మ్యాథ్స్ పరీక్షల్లో వంద మార్కులకు ఒక్కటే పేపర్‌ఉంటుందని, కనిష్టంగా 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత సాధించినట్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. బోటనీ, జువాలజీ కలిపి బయాలజీగా మార్పు చేయగా, మొదటి సంవత్సరంలో 85 మార్కులకు పరీక్ష ఉంటుందని, అయితే 29 మార్కులు, సెకండియర్‌లో 30 మార్కులు వస్తే పాస్ అయినట్లేనని వివరించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విద్యార్థులకు 30 మార్కులు చొప్పున ప్రాక్టికల్స్, గతంలో ఫెయిలై ఇప్పుడు పరీక్షలు రాయనున్న వారికి కొత్త మార్పులు వర్తించవన్నారు. కొత్తగా ఎలక్ట్రివ్ సబ్జెక్టు విధానాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం, ఏ గ్రూపు విద్యార్థులనైనా 24 సబ్జెక్టుల్లో దేనినైనా ఎంపిక చేసుకునే వెసలుబాటు కల్పించిందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రఘునాథరెడ్డి, జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రధానాచార్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


