చంద్రబాబుకు పతనం తప్పదు : సీపీఐ
అనంతపురం అర్బన్: ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న సీఎం చంద్రబాబుకు పతనం తప్పదని సీపీఐ నాయకులు హెచ్చరించారు. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని చంద్రబాబు నోట వచ్చే వరకూ పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. వైద్యకళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాఫర్, సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డి మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వైద్యకళాశాలలను 100 శాతం ప్రైవేటీకరిస్తూ జీఓ 590ని విడుదల చేశారని, తక్షణమే జీఓ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆస్తులను, ఆదాయాన్ని కారొరేట్లకు కట్టబెడుతున్నారని దుమ్మెత్తిపోశారు. ధర్నాలో నాయకులు శ్రీరాములు, రమణ, అల్లీపీరా, రాజేష్‌యాదవ్, నరేష్, కుళాయిస్వామి, పద్మావతి, చిరంజీవి, కృష్ణుడు, జయలక్ష్మి, యశోదమ్మ, తదితరులు పాల్గొన్నారు.


