ఉపాధి చట్టాన్ని బలహీన పరచొద్దు : సీపీఎం
అనంతపురం టౌన్: ఉపాధి హామీ చట్టాన్ని బలహీన పరిచే సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప డిమాండ్ చేశారు. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామి పథకానికి పేరు మారుస్తూ ప్రవేశపెట్టిన బిల్లును వెంటనే వెనక్కు తీసుకోవాలన్నారు. డిమాండ్ సాధనలోభాగంగా బుధవారం అనంతపురంలోని డ్వామా కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. కొన్ని నెలలుగా వేతనాలు అందక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధి హామి చట్టాన్ని బలహీన పరిచేందుకు మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలసల నివారణకు ప్రవేశపెట్టిన ఉపాధి హామి చట్టాన్ని మహాత్మ గాంధీ పేరిటనే కొనసాగించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డ్వామా పీడీ సలీంబాషాకు అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బాలరంగయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, ముత్తుజా, ప్రకాష్‌రెడ్డి, వలి, ఇర్ఫాన్, గోపాల్, లక్ష్మీనరసమ్మ, అశ్వని తదితరులు పాల్గొన్నారు.


