అర్చకుడంటే అంత అలుసా..? | - | Sakshi
Sakshi News home page

అర్చకుడంటే అంత అలుసా..?

Dec 17 2025 7:09 AM | Updated on Dec 17 2025 8:46 AM

అర్చక

అర్చకుడంటే అంత అలుసా..?

రాత్రంతా చలిలోనే ఆమరణ దీక్ష

ఏ ఒక్క అధికారీ పట్టించుకోని వైనం

వైఎస్సార్‌సీపీ, ప్రజాసంఘాలు, అయ్యప్ప మాలధారుల సంఘీభావం

అనంతపురం కల్చరల్‌: శింగనమలలోని దుర్గాంజనేయస్వామి సేవలో ఉన్న అర్చక కుటుంబంపై అధికార టీడీపీ మూకలు దౌర్జన్యానికి దిగి, ఆలయానికి, కమ్యూనిటీ హాలుకు తాళాలు వేసి బీభత్సం సృష్టించారు. స్థానిక అధికారులు, పోలీసులు స్పందించకపోవడంతో బాధిత అర్చకుడు బీఈ సిరి రమణ న్యాయం కోసం కలెక్టరేట్‌ ఎదుట ఫుట్‌పాత్‌పై సోమవారం ఆమరణదీక్షకు పూనుకున్నాడు. రాత్రంతా గజగజ వణికించే చలిని సైతం లెక్క చేయకుండా దీక్ష కొనసాగించాడు. కలెక్టర్‌, ఎస్పీల నుంచి ఎటువంటి స్పందనా లేకపోయింది. అయినా న్యాయం జరిగే వరకూ దీక్ష కొనసాగించాలని ప్రతిన బూనాడు. మంగళవారం అయ్యప్ప మాలధారులు, శింగనమల నుంచి విచ్చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు, వీహెచ్‌పీ, హిందూ చైతన్య వేదిక, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు అర్చకునికి సంఘీభావం తెలిపారు. అర్చకుడంటే మరీ అంత అలుసా.. భగవంతుని సేవ తప్ప మరొకటి తెలియని వారిపై ఇంత అరాచకం జరుగుతున్నా పట్టనట్టు ఉంటే ఎలా అని అధికారుల తీరుపై మండిపడ్డారు.

గుప్తనిధుల కోసమే ఆరాటం

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయ వ్యవస్థను భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి శైలజానాథ్‌ ధ్వజమెత్తారు. అర్చకుడిని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆలయాల పరిరక్షణ, అర్చకుల సంక్షేమం కోసం పాటుపడిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో అధికార టీడీపీ నేతల వైఖరితో అర్చకులు, అర్చక సంఘాల వారు బెంబేలెత్తిపోతున్నారని ఆవేదన చెందారు. దుర్గాంజనేయస్వామి ఆలయంలో గుప్తనిధులున్నాయని, రూ.6 కోట్ల ఫండ్‌ ఉందని ప్రచారం జరుగుతోందని, వీటి కోసమో ఎమ్మెల్యే శ్రావణిశ్రీ కుటుంబం కుట్ర పన్ని.. అర్చక కుటుంబంపై ఆరోపణలు చేస్తూ దాష్టీకానికి పాల్పడుతోందని ఆరోపించారు. బ్రాహ్మణుడు బలహీనుడని బాధిస్తే చూస్తూ ఊరుకోబోమని, తామంతా వెంట ఉండి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

ఆలయాలకు భద్రత కరువు

రాష్ట్రంలో ఆలయాలకు భద్రత కరువైందని ప్రభుత్వ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అర్చకుడిని పరామర్శించి, సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మాట్లాడారు. నాలుగు నెలల కిందట సింహాచల దేవస్థానంలో హుండీ చోరీ జరిగిందని, ఆరు నెలల కిందట అహోబిలం దేవస్థానంలో ఎమ్మెల్యే అనుచరులు హుండీ చోరీ చేసినా, వాడపల్లి వెంకటేశ్వరస్వామి వేవస్థానంలో శ్రీనివాసరావు అనే టీడీపీ కార్యకర్త హుండీ కానుకల లెక్కింపులో చేతివాటం ప్రదర్శించినా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించిందన్నారు. నిత్యం ఏదో ఒక ఆలయంలో టీడీపీ నాయకులు వివాదం రగిలిస్తూ ప్రజలను భయకంపితులను చేస్తున్నారన్నారు. శింగనమల అర్చక కుటుంబంపై ఎమ్మెల్యే కుటుంబం కుట్ర పన్ని ఇబ్బందులు సృష్టించడం తగదన్నారు. గుప్తనిధుల కోసం సాగుతున్న దాష్టీకంపై అధికారులకు తెలియజేసినా ఏమీ స్పందించకపోతే ఇక న్యాయం ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు. సనాతన ధర్మ పరిరక్షకుడినంటూ గొప్పగా ప్రచారం చేసుకునే డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు ఇదంతా కనిపించడం లేదా అని నిలదీశారు. ఆయన స్పందించాలంటే చంద్రబాబు స్క్రిప్ట్‌ ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు.

అర్చకుడంటే అంత అలుసా..? 1
1/1

అర్చకుడంటే అంత అలుసా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement