సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట భద్రత
● నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు : ఎస్పీ జగదీష్
రాయదుర్గం/ కళ్యాణదుర్గం రూరల్: అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని ఎస్పీ జగదీష్ తెలిపారు. రాయదుర్గం అర్బన్, రూరల్ సర్కిళ్లతోపాటు డీ హీరేహాళ్ పోలీస్‌స్టేషన్, కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్, డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులు తనిఖీ చేశారు. పెండింగ్ కేసులు, వాటి పురోగతిపై ఆరా తీశారు. అనంతరం రాయదుర్గం సర్కిల్ కార్యాలయంలో ఎస్పీ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఎక్కువ నేరాలు జరిగే ప్రాంతాలను క్రైమ్ హాట్‌స్పాట్లుగా గుర్తించామన్నారు. గ్రేవ్ కేసులను నాణ్యమైన దర్యాప్తుచేసి త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు చేపట్టామన్నారు. గంజాయి, జూదం, మట్కా లాంటి అసాంఘిక కార్యాకలాపాలపై ఉక్కుపాదం మోపామన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాల పట్ల ప్రజలంతా జాగ్రత్త పడేలా అవగాహన చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో కొత్తవ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. వచ్చే ఏడాది 2026 ఆఖరిలోగా జిల్లాకు కొత్తగా 300 మంది పోలీసులు వస్తారన్నారు. 20 మంది ఎస్‌ఐలు ట్రైనింగ్ పూర్తయి శిక్షణలో ఉన్నారని, త్వరలో వారందరికీ పోస్టింగ్‌లు ఇస్తామని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని కొనసాగిస్తున్నామన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిపరక్షణకు కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేస్తామన్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్లలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. అంతకు ముందు డీ హీరేహాళ్ మండలం మురడి ఆంజనేయస్వామి, పట్టణంలోని దశభుజ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రవిబాబు, ఆయా స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలు తదితరులు ఉన్నారు.


