శిశు మరణాలపై నిర్లక్ష్యం వద్దు
అనంతపురం మెడికల్: శిశు మరణాలపై నిర్లక్ష్యం వద్దని, మరణాల్లో లోపాలు కన్పిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ డాక్టర్ భ్రమరాంబదేవి హెచ్చరించారు. మంగళవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో గత నెలలో జరిగిన ఆరు శిశు మరణాలపై డీఎంహెచ్‌ఓ సమీక్ష నిర్వహించారు.హైరిస్క్ కేసులను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ప్రధానంగా ప్రసవ సమయంలో అత్యవసరమైతే ఆలస్యం చేయకుండా హయ్యర్ ఇన్‌స్టిట్యూట్‌కు రెఫర్ చేయాలన్నారు. ఏమాత్రం కాలాన్ని వృథా చేసినా బిడ్డ ప్రాణాలకే ప్రమాదమన్నారు. గర్భవతిగా ఉన్న సమయంలో వారికందే సేవల్లో జాప్యం లేకుండా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎం, ఆశాలు నిత్యం పర్యవేక్షణ ఉండాలన్నారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ డేవిడ్ సెల్వరాజ్, డీఐఓ డాక్టర్ శశిభూషణ్ రెడ్డి, గైనకాలజిస్టు డాక్టర్ రేణుక, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ విష్ణుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయ
అధికారిగా రవి
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యవసాయశాఖ అధికారి (డీఏఓ)గా తాడిపత్రి ఏడీఏ ఎం.రవిని నియమిస్తూ మంగళవారం కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుత డీఏఓ ఉమామహేశ్వరమ్మ ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆమెను రిలీవ్ చేయడానికి వీలుగా సీనియర్ ఏడీఏగా ఉన్న ఎం.రవికి ఎఫ్‌ఏసీ డీఏఓగా బాధ్యతలు అప్పగించారు. రెగ్యులర్ డీఏఓగా నియమితులయ్యేదాకా రవి ఎఫ్‌ఏసీ హోదాలో పనిచేయనున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. కాగా ఒక్క రోజు ముందుగానే ఈ నెల 30న ఉమామహేశ్వరమ్మ ఉద్యోగ విరమణ చేయనున్నట్లు ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
విజయవాడకు వెళ్లిన కలెక్టర్
అనంతపురం అర్బన్: సీఎం నిర్వహించే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు కలెక్టర్ ఆనంద్ మంగళవారం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఆయన ఈ నెల 19న తిరిగి విధులకు హాజరవుతారని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పీఈటీ ప్రతిభ
బ్రహ్మసముద్రం : రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పిల్లలపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ పీఈటీ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిభ చాటారు. ఈ నెల 13, 14 తేదీల్లో బాపట్లలో జరిగిన రాష్ట్రస్థాయి పోటిల్లో లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, డిస్కస్ త్రో, 4 X 100 మీటర్ల రిలే పోల్లో ప్రథమస్థానం సాధించారు. అదే విధంగా జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. త్వరలో రాజస్థాన్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బసవరాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పీఈటీ జగన్‌మోహన్‌రెడ్డిని ఉపాధ్యాయ బృందం అభినందించారు.
వెనుకబడిన విద్యార్థులపై
దృష్టి పెట్టండి
అనంతపురం సిటీ: చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, పదో తరగతి పరీక్షల్లో ప్రతి విద్యార్థీ మంచి మార్కులతో పాసయ్యేలా ఇప్పటి నుంచే కష్టపడాలని డీఈఓ ప్రసాద్‌బాబు ఆదేశించారు. అనంతపురంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మున్సిపల్ హైస్కూల్‌లో వంద రోజుల ప్రణాళిక అమలును మంగళవారం సాయంత్రం పరిశీలించారు. విద్యార్థులను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించి చదువులో పూర్తి వెనుకబడి వారికి ప్రత్యేక తర్ఫీదునిచ్చి, మార్కులతో పాసయ్యేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఈసారి పదో తరగతి ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని కోరారు. అందుకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.
శిశు మరణాలపై నిర్లక్ష్యం వద్దు
శిశు మరణాలపై నిర్లక్ష్యం వద్దు


