వేతన సవరణ చేయాలని నిరసన
అనంతపురం అగ్రికల్చర్: హెచ్‌ఆర్ పాలసీ అమలు, వేతన సవరణ చేపట్టాలనే ప్రధాన డిమాండ్లతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా సహకార అధికారి (డీసీవో) కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు, డి.శ్రీనివాసులు మాట్లాడుతూ హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, పేస్కేల్ కూడా నిర్ణయిస్తూ 2019లో జీవో 36 విడుదల చేసినా అమలుకు నోచుకోలేదన్నారు. 2019 తర్వాత వేతన సవరణ చేయకుండా చాలీచాలనీ జీతాలు ఇస్తున్నట్లు వాపోయారు. అది కూడా ‘డ్యూటు’ పద్ధతిలో చెల్లించడం దారుణమన్నారు. 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలన్నారు. రూ.20 లక్షల వరకు ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని, గ్రాట్యూటీ చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. కంప్యూటరీకరణ చేయలేదనే నెపంతో రూ.2.80 కోట్ల వరకు వేసిన అపరాధ రుసుం తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ సమస్యలపై డీసీవో అరుణకుమారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, సీఐటీయూ నాయకుడు నాగేంద్ర, పీఏసీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి.హనుమంతరెడ్డి, కోశాధికారి ఎం.హనుమంతరెడ్డి, నాయకులు డి.నారాయణ, నగేష్, రామాంజినేయులు, నరేంద్రరెడ్డి, కేసీ ఆంజనేయులు పాల్గొన్నారు.


