సంక్రాంతికి ‘పాడి’ పోటీలు
● ఆకుతోటపల్లిలో నిర్వహణకు నిర్ణయం
అనంతపురం అగ్రికల్చర్: రాయలసీమ జిల్లాల పరిధిలో తొలిసారిగా పాడి ఆవులతో పాల దిగుబడి, లేగదూడల ప్రదర్శన పోటీలు నిర్వహించాలని పశుసంవర్ధకశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ అంశంపై మంగళవారం స్థానిక పశుశాఖ కార్యాలయంలో డీడీలు, ఏడీలు, డాక్టర్లతో ఆ శాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్‌చంద్ సమీక్షించారు. ఇప్పటి వరకూ కోస్తా జిల్లాల్లోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారని, తొలిసారిగా అనంతపురం జిల్లాలోనూ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. డైరెక్టరేట్ అనుమతితో పోటీలు ఏర్పాటు, ప్రోత్సాహకాలు, ఇతరత్రా పురస్కారాలు అందజేస్తామన్నారు. రైతుల పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని జనవరి రెండో వారంలో అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లిలో పెద్ద ఎత్తున పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పాల దిగుబడి పోటీలకు జిల్లా నలుమూలల నుంచి కనీసం 150 నుంచి 200 వరకు పాడి ఆవులు తరలివచ్చేలా చూడాలన్నారు. అలాగే వందల సంఖ్యలో లేగదూడలతో ప్రదర్శన నిర్వహించాలన్నారు. ఇదే సందర్భంలో గర్భకోశవ్యాధి శిబిరం ఏర్పాటు చేసి అవసరమైన మందులు, వైద్య చికిత్సలు అందజేయాలన్నారు. పశుసంపద, జీవసంపద పరిరక్షణ, నాణ్యమైన పాడి ఉత్పత్తి కోసం పాడి రైతులను ప్రోత్సహించే క్రమంలో మొదటిసారిగా పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు జేడీ తెలిపారు. సమావేశంలో డీడీలు డాక్టర్ వై.రమేష్‌రెడ్డి, డాక్టర్ ఉమామహేశ్వరరెడ్డి, ఏడీలు రామచంద్రారెడ్డి, రత్నకుమార్, రాధిక, సుబ్రహ్మణ్యం, సురేష్, డాక్టర్లు గోల్డ్స్‌మన్, శారద, మహేష్, ఉష, సోమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


