వివాహిత బలవన్మరణం
తాడిపత్రి రూరల్: స్థానిక గన్నెవారిపల్లికాలనీలో నివాసముంటున్న వివాహిత సరళ(28) ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా కుటుంబంలో మనస్పర్థలు చోటు చేసుకుని తరచూ భర్త రాముడు గొడవపడేవాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి పెంచుకున్న సరళ... మంగళవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తాడిపత్రి రూరల్ అప్‌గ్రేడ్ సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపారు.
వేధింపుల కేసు నమోదు
ధర్మవరం అర్బన్: అదనపు కట్నం కోసం వివాహితను వేధిస్తున్న భర్త, అత్త, మామపై కేసు నమోదు చేసినట్లు ధర్మవరం టూ టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. ధర్మవరంలోని తారకరామాపురానికి చెందిన ఉప్పర నందినికి హిందూపురం మండలం బీరేపల్లికి చెందిన ఉప్పర మంజునాథ్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి అనంతరం భర్త, అత్త, మామతో కలసి బెంగళూరులోని బొమ్మసంద్ర పారిశ్రామిక వాడలో నివాసముంటూ ప్రైవేట్ ఉద్యోగాలతో జీవనం సాగిస్తున్నారు. మూడు నెలలు వీరి కాపురం సజావుగా సాగింది. అనంతరం భర్త మంజునాథ్ మద్యం సేవించి భార్యపై అనుమానంతో మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. 1 5రోజుల క్రితం అత్త అలివేలమ్మ, మామ రామలింగమయ్య, భర్త అందరూ కలసి అదనపు కట్నంతీసుకురాకపోతే విడాకులు ఇవ్వాలంటూ వేధించడంతో నందిని పుట్టింటికి చేరుకుంది. అయినా భర్త తరచూ ఫోన్ చేసి అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో విసుగు చెందిన నందిని ఫిర్యాదు మేరకు మంజునాథ్, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


