త్వరలో గుత్తి కోట అప్రోచ్ రోడ్డు పనులు
గుత్తి: చారిత్రక గుత్తి కోటపైకి ఎన్‌హెచ్ –44, ఎన్‌హెచ్ –67 నుంచి అప్రోచ్ రోడ్డు పనులు త్వరలో ప్రారంభమవుతాయని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఆదివారం కలెక్టర్ కుటుంబ సభ్యులతో కలిసి కోటను సందర్శించారు. కింది భాగంలోని ఆంగ్లేయుల సమాధులతో పాటు కొండ పైభాగాన గుర్రపు శాలలు, ఏనుగుశాలలు, చీకటి గదులు, బావులు, ఆలయాలను తిలకించారు. తర్వాత అధికారులతో కలిసి కొత్తకోట వద్ద జాతీయ రహదారుల నుంచి గుత్తి కోటకు వెళ్లేందుకు అప్రోచ్ రోడ్డు నిర్మించనున్న ప్రదేశాన్ని పరిశీలించారు. హైదరాబాద్, బెంగళూరు, చైన్నెతో పాటు ఇతర జిల్లాల నుంచి అనేకమంది జాతీయరహదారుల మీదుగా ప్రయాణం చేస్తుంటారని, గుత్తి కోటపైకి అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేస్తే కోట పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని కొత్తపేట సర్పంచ్ గురుమస్తాన్, గుత్తి కోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చౌదరి విజయభాస్కర్ కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్, తహసీల్దార్ పుణ్యవతి, కమిషనర్ జబ్బార్‌మియా, డీటీ సూరి, వీఆర్‌ఓ సురేంద్ర, కోట గైడ్ రమేష్, కోట సిబ్బంది పాల్గొన్నారు.


