పొట్టి చిత్రం.. గట్టి సందేశం
ఉరవకొండ: విడపనకల్లు మండలం కొట్టాలపల్లి గ్రామానికి చెందిన పేద దళిత రైతు కూలీ అంజనయ్య కుమారుడు భోగాల సుధాకర్ సందేశాత్మక బుల్లి చిత్రాలతో పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు. అనంతపురం బైపాస్ వద్ద రాములమ్మ గుడి వద్ద ఓ హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తునే మరో వైపు రైతాంగ సమస్యలు, మహిళలపై అఘాత్యాలు, బెట్టింగ్ బారిన పడి యువత పెడదోవ పడుతున్న తీరుపై సొంతగా స్క్రిప్ట్ రాసుకుని తీసిన షార్ట్ ఫిలింలు విమర్శకులను సైతం మెప్పించాయి. 2023, నవంబర్ నుంచి ఏఎస్‌ఆర్ షార్ట్ ఫిలిమ్స్ పేరుతో తీయడం మొదలు పెట్టిన ఆయన ఇప్పటి వరకూ దాదాపు 170కు పైగా సందేశాత్మక చిత్రాలతో పాటు హాస్యాన్ని పంచేలా మరికొన్ని వినోదభరిత చిత్రాలనూ రూపొందించారు. తన షార్ట్ ఫిలింలకు 4 లక్షలకు పైగా వీవ్స్ రావడంతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డులు దక్కించుకున్నాడు.
రైతు దయనీయ పరిస్థితి కళ్లకు కట్టేలా:
ఒక పక్క నకిలీ విత్తనాలు పురుగు మందులు చీడపీడలు, మరోపక్క దళారులు, గిట్టుబాటు కాని ధరలు... ఇంకో వైపు ప్రకృతి వైపరీత్యాలతో కుదేలవుతున్న అన్నదాతల దయనీయ స్థితిపై వ్యవసాయకుడు పేరుతో సుధాకర్ తీసిన షార్ట్ ఫిలం ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తోంది. దీంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి నగరానికి పనిపై వెళ్లిన మహిళలు మరుగుదొడ్లు అందుబాటులో లేక పడే ఇబ్బందులపై ‘నగరంలో నరకయాతన’ పేరుతో తీసిన చిత్రం ప్రశంసలు అందుకుంది. ఐపీఎల్ బెట్టింగ్ మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న యువతకు గొప్ప సందేశాన్ని ఇస్తూ ‘బెట్టింగ్ ఆడకురా మామా’ పేరుతో తీసిన షార్ట్ ఫిలిం, తల్లిదండ్రుల మాటను గౌరవించకుండా హేళన చేస్తూ, వారిని రోడ్డు మీదకు ఈడుస్తున్న నేటి తరం పిల్లల తీరుపై ‘శిక్ష ఎవ్వరికి’ అనే లఘ చిత్రం విశేష ఆదరణ పొందాయి. సమాజంలో ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న అవమానాలపై ‘మానవత్వం’ పేరుతో తీసిన షార్ట్ ఫిలిం అందరినీ ఆలోచింపజేసింది. ట్రాఫికర్ పేరుతో ట్రాఫిక్ కష్టాలు ఎలా ఉంటాయో చూపించారు.
ఉత్తమ అవార్డులు..
ఈ ఏడాది మార్చిలో విజయవాడలో జరిగిన ఉత్తమ షార్ట్‌ఫిలిం అవార్డుల ప్రధానోత్సవంలో సుధాకర్ నిర్మించిన వ్యవసాయకుడు ఫిలింకు రైతు విభాగంలో ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కింది. దీంతో పాటు అనంతపురంలో ఇదే ఏడాది ఫిబ్రవరిలో అనంత ఫిలిం ఫెస్టివల్‌లో అనంతపురం నగరంలో మహిళలకు మరుగుదొడ్ల కష్టాలపై తీసిన ‘నగరంలో నరకయాతన’ చిత్రానికి, ‘కొత్త సంవత్సరంలో కొత్త ప్రియురాలు’ అనే హాస్య చిత్రానికి అవార్డులు దక్కాయి.
సందేశాత్మక చిత్రాలతో
దూసుకెళుతున్న హోటల్ నిర్వాహకుడు
ప్రశంసలు అందుకుంటున్న కొట్టాలపల్లి రైతుకూలీ బిడ్డ బొగాల సుధాకర్
డబ్బు కంటే సందేశం ముఖ్యం
డబ్బుకు ప్రాధాన్యతనివ్వకుండా సమాజంలో మార్పు రావాలని కోరుకుంటూ షార్ట్ ఫిలింలు తీస్తున్నా. రైతుల దయనీయస్థితి, మహిళలపై అఘాయిత్యాలు, యువత పెడదారి పడకుండా చైతన్యం తీసుకొచ్చే లఘచిత్రాలను రూపొందించాను, మిత్రుడు సుంకరాజు సహకారం మరువలేను
– సుధాకర్, ఏఎస్‌ఆర్ షార్ట్‌ఫిలిం సంస్థ
వ్యవస్థాపకులు, డైరెక్టర్
పొట్టి చిత్రం.. గట్టి సందేశం


