త్వరలో జీఎంసీల్లో ఫిజియోథెరపీ కోర్సు
● ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్
అనంతపురం మెడికల్: రానున్న రోజుల్లో ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ)ల్లో ఫిజియోథెరపీ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. అనంతపురంలోని కస్తూరి ఫిజియోథెరపీ కళాశాలలో ఆదివారం జరిగిన గ్రాడ్యుయేషన్ డేకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లను అందజేసి, మాట్లాడారు. కార్యక్రమంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బెన్‌డెక్ట్, న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
విద్వేషాలు రెచ్చగొడుతూ పోస్టింగ్
నల్లచెరువు: విద్వేషాలు రెచ్చగొడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ చేసిన యువకుడిపై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు నల్లచెరువు గ్రామ యువకులు ఫిర్యాదు చేశారు. వివరాలు.. నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ అనే యువకుడు రెండేళ్ల క్రితం మతం మారి తన పేరును షేక్ మహమ్మద్ ఆసీఫ్‌గా మార్చుకున్నాడు. ఇటీవల పాకిస్తాన్‌కు అనుకూలంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ చేస్తూ వివాదాలకు తెరలేపాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎస్‌ఐ మక్బూల్‌బాషాకు ఆదివారం స్థానిక యువకులు ఫిర్యాదు చేశారు.
కారు ఢీ – విద్యార్థులకు తీవ్ర గాయాలు
ఓడీ చెరువు: కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. ఓడీచెరువులోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న భార్గవ్ (8వ తరగతి), నరసింహ (9వ తరగతి) ఎస్సీ సంక్షేమ వసతి గృహంలో ఉంటున్నారు. ఆదివారం భోజనాలు తీసుకుని వచ్చేందుకు అయ్యప్పస్వామి ఆలయం వద్దకు హాస్టల్ సిబ్బందికి చెందిన స్కూటీలో వెళుతుండగా ఎం.కొత్తపల్లి సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన భార్గవ్, నరసింహను స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, కొన్ని రోజులుగా హాస్టల్‌లో విద్యార్థులకు భోజనాలు సిద్ధం చేయకుండా సమీపంలోని ఆలయం వద్ద పెడుతున్న ఆహారాన్ని సమకూరుస్తున్నట్లుగా సమాచారం.
దుకాణంలోకి దూసుకెళ్లిన బస్సు
హిందూపురం: స్థానిక బెంగళూరు రోడ్డు లోని బోయపేటలో ఆదివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి సెల్‌ఫోన్ దుకాణంలోకి దూసుకెళ్లింది. ప్రయాణికులు ఎవరూ గాయపడలేదు. టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఉపాధ్యాయుడి దుర్మరణం
ఓడీచెరువు(అమడగూరు): ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ ఉపాధ్యాయుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... ముదిగుబ్బకు చెందిన హరికృష్ణ (36) అమడగూరు మండలం జవుకలకొత్తపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆదివారం వ్యక్తిగత పనిపై కర్ణాటకలోని బాగేపల్లికి వెళ్లిన ఆయన అక్కడ పనిముగించుకుని ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. అమడగూరు సబ్ స్టేషన్ సమీపంలోకి చేరుకోగానే మహమ్మదాబాద్ వైపు నుంచి వస్తున్న ట్రాక్టర్ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సుమతి అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, హరికృష్ణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
త్వరలో జీఎంసీల్లో ఫిజియోథెరపీ కోర్సు


