ఎస్సీ, ఎస్టీ గృహాలకు సోలార్ వెలుగులు
అనంతపురం టౌన్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ గృహాలపై రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటుకు ఏపీఎస్పీడీసీఎల్ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైసా ఖర్చు లేకుండా 2 కిలోవాట్ల సామర్థ్యమున్న సోలార్ ప్లాంట్‌ను ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక పక్రియ పూర్తయింది. త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు.
తొలుత మూడు డివిజన్లలో పనులు..
పీఎం సూర్యఘర్ పథకానికి జిల్లా వ్యాప్తంగా 17,480 మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను విద్యుత్ శాఖ అధికారులు ఎంపిక చేశారు. వీరి ఇళ్లపై 2 కిలోవాట్ల సామర్థ్యమున్న రూఫ్‌టాప్ సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేయనున్నారు. తొలి విడతలో కళ్యాణదుర్గం, గుత్తి, అనంతపురం డివిజన్లలో పనులు చేపట్టనున్నారు. లబ్ధిదారులపై నయాపైసా భారం పడకుండా సోలార్ ఫలకాలను విద్యుత్ సంస్థ ఏర్పాటు చేయిస్తోంది. ఒక్కో ఇంటిపై రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటుకు రూ.1.40 లక్షల చొప్పున వెచ్చించనున్నారు. ఎస్సీ, ఎస్టీ గృహాల వినియోగదారులు సౌర విద్యుత్‌ను వారి అవసరాలకు వినియోగించుకోగా మిగులు విద్యుత్‌ను సంస్థకు అమ్ముకునే వెసులుబాటునూ కల్పించారు.
పీఎం సూర్యఘర్ పథకం కింద
ఉచితంగా ఏర్పాటు
జిల్లా వ్యాప్తంగా 17వేల మంది
లబ్దిదారుల గుర్తింపు
20వ తేదీ నుంచి రూఫ్‌టాప్
సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు పనులు
20న పనులు ప్రారంభం
ఎస్సీ, ఎస్టీ గృహాల సోలరైజేషన్‌కు ఏపీఎస్పీడీసీఎల్‌తో తిరుపతికి చెందిన రోటోమ్యాగ్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే రూ.219 కోట్లకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ నెల 20న కళ్యాణదుర్గంలో పనులు ప్రారంభించి జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తాం.
– శేషాద్రి శేఖర్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ,
అనంతపురం


