ఎంప్లాయీస్ టోర్నీ విజేత గుంతకల్లు రైల్వే ఇంజినీర్స్
అనంతపురం కార్పొరేషన్: ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఎంప్లాయీస్ క్రికెట్ టోర్నీ విజేతగా గుంతకల్లు రైల్వే ఇంజినీర్స్ జట్టు నిలిచింది. ఆదివారం ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్‌లో గుంతకల్లు రైల్వేస్ ఇంజినీర్, అనంతపురం పోలీసు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన రైల్వే ఇంజినీర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. జట్టులో తేజ 54, నాగరాజు 43, రమేష్ 34, శివ 25 పరుగులు చేశారు. అనంతపురం పోలీసు జట్టులో షఫీ 3, వర్ధన్, ప్రభు చెరో 2 వికెట్లు తీసుకున్నారు. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన అనంతపురం పోలీసు జట్టు 19.3 ఓవర్ల వద్ద 171 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వర్ధన్ 77, ప్రభు 42 పరుగులు చేశారు. రైల్వే ఇంజినీర్ జట్టులో శ్రీధర్, అశోక్, రమేష్, శివ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 8 పరుగుల తేడాతో రైల్వే ఇంజినీర్స్ జట్టు గెలుపొందింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా రమేష్, బెస్ట్ బౌలర్‌గా అశోక్, బెస్ట్ బ్యాటర్‌గా నాగరాజు ఎంపికయ్యారు. విజేతలను అభినందిస్తూ ట్రోఫీని గుంతకల్లు రైల్వే డీఎస్‌టీఈ గోపీకృష్ణ అందజేశారు. ఏపీ వెటరన్ క్రికెటర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి, సీసీఎస్ సీఐ జయపాల్ రెడ్డి, జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగంధర్, ఏఎస్‌టీఈ వెంకటేశ్వర్లు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయరాజు, తదితరులు పాల్గొన్నారు.


