పేదలకు పెద్ద కష్టం
అనంతపురం టౌన్: పెద్ద దిక్కును కోల్పోయిన పేద కుటుంబానికి అండగా ఉండే బీమా పథకానికి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడింది. 18 నెలలు పూర్తి కావస్తున్నా బీమా పథకం అమలుపై ఎటువంటి ప్రకటనా చేయకపోవడంతో పేదలు మండిపడుతున్నారు. రేషన్‌కార్డు కలిగిన కుటుంబ పెద్ద ఆకస్మిక, సహజ మరణం పొందినపుడు ఆ కుటుంబం రోడ్డునపడకుండా ఆర్థిక ఉపశమనం కలిగించడం కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ‘వైఎస్సార్ బీమా’ పథకం ప్రవేశపెట్టింది. కుటుంబ పెద్ద సహజంగా మరణిస్తే రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.5 లక్షలు, శాశ్వత వికలాంగులుగా మారితే రూ.5 లక్షలు, 70 ఏళ్ల వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.3 లక్షలు అందించే విధంగా పథక రూపకల్పన చేసింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో బీమా పథకం అమలు చేసేవారు. ఇందు కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూంతోపాటు 24 గంటలూ పని చేసే విధంగా అధికారులను కేటాయించారు. ఫోన్ ద్వారా సమాచారం అందిన వెంటనే వివరాలు నమోదు చేసుకొని, దగ్గరలోని ఏపీఎంలకు, యానిమేటర్లకు విషయం తెలిపి మానిటరింగ్ చేసి సకాలంలో బీమా మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేసేలా చర్యలు తీసుకునేవారు. ఇందు కోసం గత ప్రభుత్వం ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించింది.
పేదల సంక్షేమం గాలికి..
చంద్రబాబు ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న బీమా పథకం అమలులో తాత్సారం చేస్తోంది. జిల్లాలో రేషన్‌కార్డులు కలిగిన కుటుంబాలు 6.50 లక్షలు ఉన్నాయి. గత ఏడాది (2024–25) జరిగిన వివిధ ప్రమాదాల్లో 540 మంది చనిపోయారు. ఈ ఆర్థిక సంవత్సరం (2025–26)లో ఇప్పటి వరకు 464 మంది మరణించారు. ఇక ఏటా 1200 నుంచి 1500 సహజ మరణాలు నమోదవుతున్నాయి. వందలాది మంది ప్రమాదాల కారణంగా వైకల్యం బారినపడి మంచానపడ్డారు. బీమా పథకం లేకపోవడంతో ఆయా కుటుంబాల వారు రోడ్డునపడ్డారు. అయినా ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటంపై పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషణ, పిల్లల చదువులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ప్రభుత్వం స్పందించి బీమా పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.
చంద్రన్న బీమా.. ధీమా ఇచ్చేదెప్పుడు?
తాము అధికారంలోకి వస్తే చంద్రన్న బీమా పథకం అమలు చేస్తామని ‘ప్రజాగళం – ఉమ్మడిమ మేనిఫెస్టో–2024’లో కూటమి నేతలు హామీ ఇచ్చారు. గతం కన్నా మిన్నగా ఆర్థికప్రయోజనం చేకూరుస్తామని గొప్పలు చెప్పారు. సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని పొందుపరిచారు. అయితే ఇంతవరకూ చంద్రన్న బీమా పథకం గురించి మాట్లాడే నాథులే లేరు. ఏడాదిన్నర గడిచినా అతీగతీ లేకపోవడంతో ఈ మధ్యలో ఎంతోమంది పెద్దలను కోల్పోయిన కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. బీమా అమలు చేసి ఉంటే కాసింత ఉపశమనం కలిగేదని అంటున్నారు.
బీమా పథకానికి మంగళం!
రేషన్‌కార్డుదారులకు
వర్తించని బీమా
కుటుంబ పెద్దను కోల్పోతే
సభ్యులు రోడ్డుపాలేనా?
ఏడాదిన్నర అవుతున్నా
చంద్రన్న బీమాపై స్పష్టత ఇవ్వని సర్కార్
బీమా సిబ్బందిని ఇతర విభాగాలకు సర్దుబాటు చేసిన వైనం
ఇంకా ప్రకటన రాలేదు
బీమా పథకం అమలు కోసం ఇదివరకు డీఆర్‌డీఏ కార్యాలయంలో ప్రత్యేకంగా ఎనిమిది మంది సిబ్బంది పని చేసేవారు. 24 గంటలూ పని చేసే విధంగా ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఉండేది. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి బీమాకు సంబంధించి ప్రకటన ఏదీ రాలేదు. అందుకని సిబ్బందిని ఇతర విభాగాలకు మళ్లించాం. బీమా పథకం అమలుపై ఏదైనా ప్రకటన వస్తే సిబ్బందిని తిరిగి బీమా విభాగంలో విధుల కోసం కేటాయిస్తాం.
– శైలజ, పీడీ, డీఆర్‌డీఏ
పేదలకు పెద్ద కష్టం


