ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతుల ఆత్మహత్యలు
గార్లదిన్నె: ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటులో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. కోటంకలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు గుర్రప్పకుటుంబ సభ్యులను ఆయన సోమవారం పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ధరల స్థిరీకరణ నిధి, పంటలకు గిట్టుబాటు ధర ఉంటే రైతు గుర్రప్ప ఆత్మహత్య చేసుకునేవారు కాదన్నారు. ఎక్స్‌గ్రేషియా చెల్లించి రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతులకు విత్తు నుంచి పంట విక్రయం వరకు అడుగడుగునా అండగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. రైతుల చెంతనే వ్యవసాయ సేవలు, పకడ్బందీగా సంక్షేమ పథకాలు అందించారన్నారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం పంటలు నష్టపోయిన రైతులకు బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ వంటివి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. గిట్టుబాటు ధరలతో పంట ఉత్పత్తులు కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. రైతులెవ్వరూ అధైర్యపడవద్దని, వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఇదే గ్రామంలో ఇటీవల హఠాన్మరణం చెందిన చాబాల సూరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి, మండల కన్వీనర్ ఎల్లారెడ్డి, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులు ఓబిరెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.


