కడుపు మాడ్చటంపై కన్నెర్ర
● రోడ్డెక్కిన విద్యార్థులు
● ఆందోళనలో పాల్గొన్న తల్లిదండ్రులు
● హెచ్‌ఎం తీరుపై మండిపాటు
గుమ్మఘట్ట: మధ్యాహ్న భోజన పథకం కింద అరకొరగా అన్నం పెడుతూ కడుపు మాడుస్తుండటంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పూలకుంట క్రాస్‌లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 169 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ నెల రోజులుగా మధ్యాహ్న భోజనం సక్రమంగా అందించడం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణం కన్నా తక్కువగా భోజనం వడ్డిస్తుండటంతో విద్యార్థులు ఆకలితో నకనకలాడాల్సి వస్తోంది. తరగతి గదిలో పాఠాలు కూడా వినలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులు సోమవారం బీటీపీకి వెళ్లే ప్రధాన రోడ్డుపైకి చేరుకుని బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమనెందుకు ఆకలితో చంపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని ఆందోళనలో పాల్గొన్నారు. వాహనాల రాకపోకలు స్తంభించడంతో ఎంఈఓ సోమశేఖర్, ఎస్‌ఐ ఈశ్వరయ్య వచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు. అనంతరం విద్యార్థుల సమస్యపై పాఠశాలకు వెళ్లి హెచ్‌ఎం బషీర్ అహమ్మద్‌ను నిలదీశారు. విద్యార్థుల హాజరు శాతాన్ని బట్టి బియ్యాన్ని ఏజెన్సీ నిర్వాహకులకు అందిస్తున్నానని హెచ్‌ఎం తెలిపారు. హాజరు కన్నా తక్కువగా బియ్యం ఇవ్వడం వల్లే విద్యార్థులకు తగినంత భోజనం పెట్టలేకపోతున్నామని ఏజెన్సీ నిర్వాహకురాలు పార్వతి స్పష్టం చేశారు. తమ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని బియ్యంలో కోత విధిస్తున్నారని ఆరోపించారు. అనంతరం డిప్యూటీ డీఈఓ మల్లారెడ్డి పాఠశాలకు వెళ్లి ఘటనపై విచారణ చేపట్టారు. హెచ్‌ఎం బషీర్ అహ్మద్ విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు అసభ్య పద జాలంతో దూషిస్తుంటారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నివేదిక తయారు చేసి కలెక్టర్‌కు అందిస్తానని డిప్యూటీ డీఈఓ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా బషీర్ అహ్మద్ ఇదివరకు పనిచేసిన నేత్రపల్లి, టీ.వీరాపురం, తాళ్లకెర పాఠశాలలోనూ ఇదే విధంగా ప్రవర్తించేవారని, ఇప్పటికీ ఆయనలో మార్పు రాలేదని పలువురు ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.


