పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
అనంతపురం సిటీ: వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్న పదో తరగతి, ఓపెన్ స్కూల్, ఒకేషనల్‌కు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లించే గడువును పొడిగించినట్లు డీఈఓ ప్రసాద్‌బాబు సోమవారం తెలిపారు. అపరాధ రుసుం లేకుండా 9వ తేదీ వరకు, రూ.50 అపరాధ రుసుముతో ఈ నెల 10 నుంచి 12 వరకు, రూ.200 ఫైన్‌తో 13 నుంచి 15 వరకు, రూ.500 జరిమానాతో 16 నుంచి 18వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని వివరించారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు సంబంధించి రూ.125, పరీక్ష తప్పిన విద్యార్థులైతే మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఉంటే రూ.125, మూడు కంటే తక్కువ సబ్జెక్టులు ఉంటే రూ.110, ఒకేషనల్ విద్యార్థులు రెగ్యులర్ ఫీజుతో పాటు అదనంగా రూ.60, తక్కువ వయస్సు వారు రూ.300, మైగ్రేషన్ కోసం రూ.80 చెల్లించాలని సూచించారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు యూడైస్ పోర్టల్‌లో విద్యార్థి వివరాలు ధ్రువీకరించిన తరువాత www.bse.ap.gov.inలోని పాఠశాల లాగిన్ ద్వారా అప్లికేషన్లను అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.
నేడు డయల్ యువర్ ఎస్‌ఈ
అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం ‘డయల్ యువర్ విద్యుత్ శాఖ ఎస్‌ఈ’ కార్యక్రమం నిర్వహించనున్నారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు 08554– 272943 లేదా 91547 90350కు ఉదయం 10 నుంచి 11.30 గంటల లోపు ఫోన్ చేసి విద్యుత్ సమస్యలను తెలపాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ముగ్గురు మిత్రులు వచ్చేశారు
రాప్తాడు రూరల్: రాప్తాడు మండలం చిన్మయనగర్ ఎల్‌ఆర్‌జీ స్కూల్‌లో పదో తరగతి చదువుతూ అదృశ్యమైన ముగ్గురు మిత్రులు తిరిగి వచ్చేశారు. దీంతో పోలీసులు, పాఠశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థులు ఎం.సుధీర్, గంగుల దీపక్ కుమార్, జి.ఆంథోని ప్రకాష్ ఈ నెల 5న స్కూల్ నుంచి వెళ్లిపోయారు. అనంతపురంతో పాటు బెంగళూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో పోలీసులు, కుటుంబ సభ్యులు గాలించారు. నాలుగు రోజులవుతున్నా వీరి ఆచూకీ లభించని వైనంపై ‘సాక్షి’లో సోమవారం ‘వీడని ముగ్గురు మిత్రుల అదృశ్యం మిస్టరీ’ శీర్షికన వెలువడిన కథనానికి స్పందన లభించింది. తల్లిదండ్రులు మానసికంగా పడుతున్న బాధను తెలుసుకున్న విద్యార్థుల్లో ఒకరు తల్లికి ఫోన్ చేసి తాము గుంతకల్లులో ఉన్నామని, రైలు ఎక్కి అనంతపురం వస్తున్నామని తెలిపారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, పోలీసులు అనంతపురం రైల్వేస్టేషన్‌కు వెళ్లి.. వారు రాగానే అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో సీఐ శ్రీహర్ష ఎదుట హాజరు పరిచారు. చదువుకోవడం ఇష్టం లేకనే విద్యార్థులు వెళ్లిపోయారని సీఐ తెలిపారు. కౌన్సెలింగ్ అనంతరం ముగ్గురినీ తల్లిదండ్రులకు అప్పగించారు.
పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు


