జీవ సంబంధ ఎరువులతో ‘చీనీ’లో అధిక దిగుబడి
● కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త మాధవి
గార్లదిన్నె: జీవ సంబంధ ఎరువుల వినియోగంతో చీనీలో అధిక దిగుబడి సాధించవచ్చునని రైతులకు కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్ర వేత్త మాధవి సూచించారు. గార్లదిన్నె మండలం బూదేడు, మర్తాడు గ్రామాల్లో మంగళవారం ఉద్యాన పంటలను ఆమె పరిశీలించి, రైతులతో మాట్లాడారు. చీనీలో కోతల అనంతరం కొత్త చిగురు వచ్చిన వెంటనే ఎకరాకు 100 ఎం.ఎల్ చొప్పున డ్రిప్పు ద్వారా ట్రైకోడెర్మా , సుడోమనాస్, పైబ్‌సోల్ వంటి జీవ సంబంధ ఎరువులను అందజేయాలన్నారు. అలాగే పూత, పిందె దశలోనూ డ్రిప్పు ద్వారా అందజేస్తే మొక్కలకు హాని కలిగించే తెగుళ్ల నుంచి సమర్థవంతంగా కాపాడుకోవచ్చునన్నారు. కలుపు నివారణ మందులు అధికంగా వాడితే చీనీ చెట్ల కాలపరిమితి సగానికి పైగా దెబ్బతింటుందన్నారు. దిగుబడులు సైతం 50 శాతానికి పైగా తగ్గుతాయన్నారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు ఉద్యానశాఖ అందజేస్తున్న కలుపు నిరోధక పట్టాలను వినియోగించాలన్నారు. తైవాన్ పంపులు, ప్లాస్టిక్ క్రేట్స్, ప్యాక్ హౌస్‌లు, ఫారం పాండ్లు కావాల్సిన ఎస్సీ, ఎస్టీ రైతులు ఆయా గ్రామాల రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎస్సీ,ఎస్టీ రైతులకు వర్తించే పథకాలను సూక్ష్మ నీటి పాగు పథకం సంచాలకులు రఘునాథ రెడ్డి వివరించారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు రత్నకుమార్, ఉమాదేవి, మండల వ్యవ సాయ అధికారి సోమశేఖర్, ఉద్యాన విస్తరణ అధికారి రామాంజనేయులు, రైతులు పాల్గొన్నారు.


