పశు కిసాన్ క్రెడిట్ కార్డులను సద్వినియోగం చేసుకోండి
● పశు సంవర్ధశాఖ జేడీ ప్రేమ్‌చంద్
రాయదుర్గం టౌన్: పశు కిసాన్ కెడ్రిట్ కార్డు (పీకేసీసీ) ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని పాడి రైతులకు పశు సంవర్ధశాఖ జాయింట్ డైరక్టర్ డాక్టర్ పి.ప్రేమ్‌చంద్ సూచించారు. రాయదుర్గంలోని ప్రాంతీయ పశువైద్యశాలతో పాటు మార్కెట్ యార్డులోని పశువ్యాధి నిర్ధారణ సీఏడీడీఎల్ ల్యాబ్, ఆవులదట్ల గ్రామంలోని పశువైద్యశాలను మంగళవారం ఆయన పరిశీలించారు. పశువైద్యశాలల్లో మందుల నిల్వ, గదులు, కంప్యూటర్ రూములను పరిశీలించారు. పశువులకు అందుతున్న వైద్యం, సేవలు, టీకాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అతి తక్కువ వడ్డీతో రుణం లభించే పీకేసీసీ కార్డు ప్రయోజనాలను వివరించారు. ఉపాధి హామీ పథకం కింద గడ్డి పెంపకానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా పశువులకు టీకాలు వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో రాయదుర్గం, ఆవులదట్ల, గుమ్మఘట్ట పశువైద్యాధికారులు సూర్యనారాయణ రెడ్డి, శిరీష, నవీన్ పాల్గొన్నారు.
రెగ్యులేటర్ కూలడంపై రైతుల్లో ఆందోళన
బొమ్మనహాళ్: ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే హెచ్చెల్సీపై క్రాస్ రెగ్యులేటర్ కూలిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెచ్చెల్సీ పరిధిలో ఏదైనా అంవాఛనీయ ఘటన చోటు చేసుకున్నప్పుడు నీటిని వాగుకు మళ్లించేందుకు వీలుగా బొమ్మనహాళ్ హెచ్చెల్సీ సెక్షన్ పరిధిలోని నాగలాపురం వద్ద 116–400 కిలోమీటర్ వద్ద ఏర్పాటు చేసిన క్రాస్ రెగ్యులేటర్ ఆదివారం రాత్రి కూలిపోయింది. నాలుగు గేట్లల్లో మూడు కాలువలో కొట్టుకుపోయాయి. 1965లో హెచ్చెల్సీ ప్రధాన కాలువ నిర్మించిన సమయంలో ఈ క్రాస్ రెగ్యులేటర్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దీనికి ఎలాంటి మరమ్మతులు చేయలేదు. కొన్నేళ్లుగా నిర్వహణ చేపట్టకపోవడంతో గేట్లు తుప్పు పట్టాయి. ఆదివారం రాత్రి నీటి ప్రవాహ వేగానికి క్రాస్ రెగ్యులేటర్ ఒక్కసారిగా కూలిపోయింది. మిగిలిన ఒక్క గేటుకు కూడా కూలిపోవడానికి సిద్దంగా ఉంది. ఇటీవల అత్యవసర మరమ్మతుల కోసం రూ.35.06 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టిన ప్రభుత్వం... శిథిలావస్ధకు చేరిన క్రాస్ రెగ్యులేటర్‌ను గాలికి వదిలేసిందని రైతులు మండిపడుతున్నారు. క్రాస్ రెగ్యులేటర్‌లోని గేట్లకు మరమ్మతులు చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని అంటున్నారు.


