నా బిడ్డను ఇవ్వకపోతే చచ్చిపోతా!
● సర్వజనాస్పత్రిలో దివ్యాంగ బాలింత ఆవేదన
అనంతపురం మెడికల్: ఏందమ్మా నా బిడ్డను నా చేతికెందుకివ్వరూ. రెండ్రోజులవుతోంది నా బిడ్డను నాకిచ్చేయండి. లేకపోతే చచ్చిపోతా’ అంటూ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్యులు, స్టాఫ్‌నర్సులను ఓ బాలింత వేడుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లికి చెందిన ఓ 30 ఏళ్ల గర్భిణి (ఓ కాలు లేదు) ఈ నెల 10న ఆస్పత్రికి వచ్చింది. రక్తహీనత, తదితర సమస్యలతో బాధపడుతుంటే లేబర్ వార్డులో అడ్మిషన్ చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 18న ఆమె మగబిడ్డను ప్రసవించింది. బిడ్డకు కామెర్లులా ఉండడంతో ఆస్పత్రిలోని నవజాతా శిశు కేంద్రంలో అడ్మిట్ చేశారు. ఫొటోథెరపీ కింద బిడ్డను ఉంచి వైద్యులు సేవలందిస్తున్నారు. బిడ్డకు తల్లిపాలు ఇబ్బంది లేకుండా మదర్‌మిల్క్ బ్యాంక్ ద్వారా అందిస్తున్నారు. ఆస్పత్రిలోని పోస్టునేటల్ వార్డులో అడ్మిషన్‌లో ఉన్న బాలింతకు తన బిడ్డ గుర్తొచ్చినప్పుడల్లా ఎస్‌ఎన్‌సీయూ వద్దకెళ్లి సిబ్బందిని ప్రాధేయపడుతోంది. బిడ్డకు బాగలేదని మళ్లీ ఇస్తామని చెబుతున్న సిబ్బందితో గొడవ పడి తిరిగి వార్డుకు చేరుకుంటోంది. ఇదే అంశంపై గైనిక్ హెచ్‌ఓడీ షంషాద్ బేగం మాట్లాడుతూ.. బాలింత సంబంధీకులు ఇప్పటి వరకూ ఎవరూ రాలేదని తెలిపారు. తన పేరు మాత్రం మంజుల అని, ఎవరూ లేరని సమాధానం చెబుతోందన్నారు. ఆమె మానసిక స్థితి సరిగా లేని కారణంగా శిశువును అప్పగిస్తే ఆ పసికందును ఏం చేస్తుందోనని సిబ్బంది భయపడుతున్నారని, సంబంధీకులు ఎవరైనా వచ్చి బాలింతకు మేలుగా ఉంటుందని పేర్కొన్నారు.


