వ్యక్తి హత్య
● పోలీసుల అదుపులో అనుమానితులు
తాడిపత్రి టౌన్: స్థానిక భగత్‌సింగ్ నగర్‌కు చెందిన పెయింటర్ రాజా (45) బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ఇళ్లకు పెయింటింగ్ పనితో జీవనం సాగిస్తున్న రాజాకు 20 ఏళ్ల క్రితం పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లికి చెందిన సరస్వతితో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. రాజా మద్యానికి బానిసగా మారి తరచూ గొడవ పడుతుండడంతో పదేళ్ల క్రితం ఇద్దరు పిల్లలను తీసుకుని భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి భగత్‌సింగ్ నగర్‌లో ఒంటరిగానే జీవిస్తున్నాడు. రోజూ మరో ఇద్దరితో కలసి రాత్రి సమయంలో ఫుల్‌గా మద్యం సేవించే వాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం మత్తులో వెళుతున్న రాజా అశోక్‌పిల్లర్ సమీపంలోకి చేరుకోగానే గుర్తు తెలియని వ్యక్తులు తలపై సిమెంట్ దిమ్మెతో మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం ఉదయం గుర్తించిన స్థానికుల సమాచారంతో ఏఎస్పీ రోహిత్‌కుమార్, సీఐ ఆరోహణరావు, ఎస్‌ఐ గౌస్‌మహమ్మద్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. కాగా, రాజాతో కలసి రోజూ మద్యం సేవించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.


