పుట్టడమే నేరమా?
అప్పగిస్తే సంరక్షిస్తాం
రాయదుర్గం: అమ్మా .. అనే పిలుపు కోసం తహతహలాడే వారు ఎందరో ఉన్నారు. అమ్మ ప్రేమలో ఎలాంటి కల్తీ ఉండదని అంటారు. బిడ్డకు జన్మనివ్వడానికి ఎన్నో బాధలను సైతం లెక్కచేయకుండా చిరునవ్వుతో కష్టాన్ని భరిస్తూ, పురిటి నొప్పులతో పునర్జన్మను పొందే తల్లులూ ఎందరో ఉన్నారు. అంతటి త్యాగమూర్తుల పేరుకే మచ్చతెచ్చేలా కొందరు కర్కశత్వం ప్రదరిస్తున్నారు. పేగు పంచుకుని పుట్టిన వారిని కనికరం లేకుండా ముళ్లపొదల్లో వదిలేస్తున్నారు. అమ్మా! నేనేం పాపం చేశా, పుట్టడమే నేరామా? అంటూ పసి హృదయాలు ఆక్రోసించేలా చేస్తున్నారు. జిల్లాలో గత మూడేళ్లుగా 31 మంది పసికందులు శిశుగృహలో చేరారు. లెక్కకు రాని మరణాలు మరెన్ని ఉన్నాయి. జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలైన కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, అనంతపురం పరిసరాల్లో ఇలాంటి కేసులు ఎక్కువగా వెలుగు చూస్తుండడం విశేషం. ఇటీవల కళ్యాణదుర్గంలో ముళ్లపొదల్లో లభ్యమైన శిశువును సరిగ్గా చూసుకోలేక మృత్యుఒడికి చేర్చారు. అలనాపాలన చూడాల్సిన అధికారులు సరైన వసతులు సమకూర్చక పోవడంతోనే శిశువు మృతికి కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి అప్పటి ఐసీడీఎస్ పీడీని బాధ్యురాలిని చేస్తూ సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు.. అసలు కారకులను మాత్రం ఉపేక్షిస్తున్నట్లుగా ఆరోపణలు వినవస్తున్నాయి.
ఏ కారణం చేతనైనా బిడ్డను పోషించడం భారమనుకుంటే శిశుగృహలో అప్పగించాలి. శిశువులను పెంచి పోషించే బాధ్యత తీసుకుంటాం. బిడ్డను అప్పగించాక 60 రోజుల్లో మనసుమారితే ఎప్పుడైనా సరే వెనక్కు తీసుకెళ్లవచ్చు. ఇటీవల పెళ్లికాని ఓ అమ్మాయి కూడా బిడ్డకు జన్మనిచ్చింది. వేరే ఆలోచన చేయకుండా నేరుగా శిశుగృహకు అప్పగించింది. ఆ బిడ్డ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. ఇలా చేయకుండా భయపడి ముళ్లపొదలు, రోడ్డుపక్కన వదిలివెళ్లడం మంచిది కాదు. శిశుగృహలో ఏ ఒక్క బిడ్డా మృతి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ విషయంపై ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు చేపడుతున్నాం. – అరుణకుమారి, ఐసీడీఎస్ పీడీ


