వ్యక్తిని కాపాడిన రైల్వే పోలీసులు
తాడిపత్రి రూరల్: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ కింద పడి ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని సకాలంలో రైల్వే పోలీసులు కాపాడారు. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా కొలిమిగుండ్లకు చెందిన వెంకటస్వామినాయక్, అతని సోదరుల మధ్య పొలం వివాదం ఉంది. స్థిరాస్తి పంపకంలో తనకు జరిగిన అన్యాయాన్ని తాళలేక చనిపోతున్నట్లు ఇంట్లో చెప్పి గురువారం ద్విచక్ర వాహనంపై చింతలాయపల్లికి చేరుకున్నాడు. అక్కడ బైక్ వదిలి తాడిపత్రికి వచ్చాడు. అనంతరం అతిగా మద్యం సేవించి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అదే సమయంలో వేగంగా వస్తున్న గూడ్స్ రైలును గమనించి దానికి ఎదురుగా పట్టాలపై పరుగు తీస్తుండడం గమనించిన కానిస్టేబుల్ శివారెడ్డి, రైల్వే పోలీసులు వెంటాడి సకాలంలో పట్టాలపై నుంచి పక్కకు లాగారు. అనంతరం రైల్వే పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కుటుంబసభ్యులను పిలిపించి, కౌన్సెలింగ్ అనంతరం అప్పగించారు.
సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి
అనంతపురం టౌన్: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతలు కల్పించాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌కు పలువురు సచివాలయ ఉద్యోగులు విన్నవించారు. ఈ మేరకు అనంతపురంలోని మంత్రి నివాసంలో గురువారం కేశవ్‌ను కలసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. ఆరేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. జీఓ 523 ను సవరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు సుధాకర్, లక్ష్మీనారాయణ, వరప్రసాద్, మల్లికార్జున, చంద్ర, శివశంకర్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.
డిసెంబర్‌లోపు
షీప్ సొసైటీ ఎన్నికలు
అనంతపురం అగ్రికల్చర్: గొర్రెలు, మేకల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘాలకు డిసెంబర్‌లోపు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్‌చంద్ తెలిపారు. స్థానిక షీప్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో యూనియన్ సాధారణ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కేఎల్ శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జేడీ డాక్టర్ జి.ప్రేమ్‌చంద్, పర్సన్ ఇన్‌చార్జి /డీడీ డాక్టర్ వై.రమేష్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కాగా వీఏఎస్ డాక్టర్ గోల్డ్స్‌మన్ పాల్గొన్నారు. నిద్రావస్థలో ఉన్న ప్రాథమిక గొర్రెల సంఘాలను పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా గడువు మీరిన సంఘాలకు త్వరలో ఎన్నికలు, ఆ తర్వాత జిల్లా కమిటీకి ఎన్నికలు నిర్వహించాలని సభ ఆమోదించింది. జీవాలకు, కాపర్లకు బీమా సదుపాయం ఉందని, షెడ్లు నిర్మాణాలను ప్రోత్సహిస్తామని, జీవాల సంరక్షణకు మెరుగైన వైద్య సేవలు, వ్యాక్సినేషన్లు ఇస్తామని తెలిపారు.


