పంచాయతీల ఆదాయ వనరులు గుర్తించండి
● ఎంపీడీఓలతో జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ
అనంతపరం టవర్‌క్లాక్: గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే నిధులు ముఖ్యమని, ఇందుకు గాను పంచాయతీల సొంత ఆదాయవనరులను గుర్తించాలని ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎంపీడీఓలకు జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ సూచించారు. పంచాయతీల ఆదాయ వనరుల గుర్తింపు అంశంపై జెడ్పీలోని డీపీఆర్సీ భవనంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం గిరిజమ్మ ప్రారంభించి, మాట్లాడారు. వృథాగా ఉన్న పంచాయతీ స్థలాలను వాణిజ్య కేంద్రాలుగా మార్చాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఫ్యాక్టరీలు, వెంచర్లు, సెల్ టవర్లు ఏర్పాటు వంటి వాటికి అనుమతులు ఇవ్వాలన్నారు. చెత్తతో సంపద తయారీ, ఇంటి పన్నులు, ప్యాక్టరీ పన్నుల సక్రమంగా వసూళ్లు చేసి గ్రామ పంచాయతీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు పాల్గొన్నారు.
28 నుంచి మండల కేంద్రాల్లో శిక్షణ
ఉమ్మడి జిల్లాలో పంచాయతీ సొంత ఆదాయ వనరుల గుర్తింపు ప్రతి మండలంలో శిక్షణ తరగతులు నిర్వహించాలనిధ ఎంపీడీఓలకు జెడ్పీ సీఈఓ శివశంకర్ సూచించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28 నుంచి 29 వరకు రెండు రోజుల పాటు ప్రతి మండల కేంద్రంలో పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు, డిజిటల్ అసిసెంట్లు, ఇంజనీరింగ్ అసిసెంట్లకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలన్నారు. శిక్షణ విధివిధానాలను వెల్లడించారు.


