పప్పుశనగ విత్తనం కోసం ధర్నా
అనంతపురం అగ్రికల్చర్: రబీలో పంట సాగుకు వీలుగా 90 శాతం సబ్సిడీతో విత్తన పప్పుశనగను వెంటనే రైతులకు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా బుధవారం స్థానిక వ్యవసాయశాఖ జేడీ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రబీ ప్రారంభమై 25 రోజులు కావస్తున్నా రైతులకు రాయితీ విత్తనం ఇవ్వకుండా చంద్రబాబు సర్కారు మోసం చేస్తోందన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతుండటంతో సాగుకు వీలుగా వెంటనే విత్తనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత రబీతో పాటు ఈ ఖరీఫ్‌లోనూ అననుకూల వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విత్తనం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. కేటాయింపులు, రాయితీలు కుదించడం, ధరలు బాగా పెంచడం వల్ల రైతులకు ప్రయోజనం ఉండదన్నారు. 90 శాతం సబ్సిడీతో వెంటనే పంపిణీ చేయాలన్నారు. అనంతరం జేడీఏ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ధర్నాలో సీపీఎం, రైతు సంఘం నాయకులు వి.రామిరెడ్డి, ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి, ఎం.కృష్ణమూర్తి, బి.శివారెడ్డి, బీహెచ్ రాయుడు, చెన్నారెడ్డి, సంజీవరెడ్డి, పోతులయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


