దేశంలో ఎక్కడా చూడని అతి పెద్ద భూకబ్జా
అనంతపురం ఎడ్యుకేషన్: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సమక్షంలో దేశంలో ఎక్కడా, ఎప్పుడూ చూడని అతిపెద్ద భూకబ్జా అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. పాపంపేటలో 930 ఎకరాలను కబ్జా చేయాలని చూస్తున్నారన్నారు. 1908లో ఇచ్చిన శోత్రియం డాక్యుమెంట్లను అడ్డుపెట్టుకుని ఇప్పుడు ఎలా రిజిస్టర్ చేస్తారని ప్రశ్నించారు. ఇలాగైతే 1928లో డైక్లాయిడ్‌లో మా పూర్వీకుల పేర్లు కల్గిన భూములను మాకు రిజిస్టర్ చేస్తే 2 వేల ఎకరాలకు పైగానే వస్తాయని, అధికారులు రిజిస్టర్ చేస్తారా? అని ప్రశ్నించారు.
పరిటాల బంధువుల పేరిట జీపీఏ
పరిటాల సునీత ఎమ్మెల్యే అయిన తర్వాత శోత్రియందారుల వారసులు ఆమె బంధువుల పేరిట 3.5 ఎకరాల రిజిస్ట్రేషన్ జీపీఏ,290 ఎకరాలకు పెండింగ్ రిజిస్ట్రేషన్ జీపీఏ చేశారన్నారు. ఆ ప్రాంతంలో ఎక్కడ ఖాళీ స్థలాలుంటే అక్కడ పరిటాల సమీప బంధువు శ్రీరాములు బోర్డులు నాటారన్నారు. తాను ప్రెస్‌మీట్ పెట్టి, కలెక్టర్‌ను కలిసి విన్నవించిన తర్వాత బోర్డులన్నీ తొలగించారన్నారు. రెగ్యులరైజ్ చేసుకోవాలంటూ ఇప్పటికే 10 సెంట్ల యజమానితో రూ. 30 లక్షలు తీసుకున్నారన్నారు. మరో 19 సెంట్ల యజమానితో మంతనాలు సాగిస్తున్నారన్నారు. ఈ డబ్బంతా పరిటాల సునీత కుమారుడు సిద్దార్థ్‌కు వెళ్తోందన్నారు. సునీత తన పెద్ద కొడుకుకు ధర్మవరం, చిన్న కొడుకుకు అనంతపురం రూరల్ మండలం అప్పగించిందన్నారు. అక్కడ ఆయన రూ. 500 కోట్లు, ఇక్కడ ఈయన రూ. 500 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారని ఆరోపించారు.
‘ఈనాడు’తో కలిసి కుట్ర
పాపంపేట బాధితుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఈనాడు పత్రికతో కలిసి కుట్ర పన్నారని ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. ఇందులో భాగంగానే ఖాళీ స్థలాలు మాత్రమే అప్పగించాలంటూ శోత్రియందారుల వారసులు అడుగుతున్నట్లు ‘ఈనాడు’ పత్రిక రాసిందని, ఇలా విభజించు–పాలించు అనే కుట్ర అమలు చేస్తున్నారని చెప్పారు. 6 వేలమంది ఉద్యమబాట పట్టకుండా విభజించే ప్రయత్నాలకు తెరలేపార న్నారు. మండల సర్వేయర్, వీఆర్‌ఓ 176 ఎకరాలకు పొజిషన్ సర్టిఫికెట్లు ఎలా ఇస్తారని నిలదీశారు. దీనిపై కొందరు ఆర్‌టీఐ కింద కోరగా వీఆర్‌ఓ సంతకం ఫోర్జరీ అని తేలిందన్నారు. తప్పుడు పత్రాలతో జీపీఏ చేయించినవారు, చేయించుకున్నవారు కలెక్టర్‌తో గ్రూపు ఫొటో తీసుకున్నారన్నారు. సమస్యపై తాను బాధితులతో పాటు కలెక్టర్‌ను కలిశానని, ఆధారాలతో వివరిస్తా.. 15 నివషాలు గడువు కావాలని కోరినా స్పందించలేదన్నారు.
అప్పట్లోనే రూ.7 కోట్ల వసూళ్లు
2017లో జీపీఏను అడ్డుపెట్టుకునే అదే ప్రాంతంలోని విద్యారణ్యనగర్‌లో 600 ఇళ్ల యజమానుల నుంచి రూ. 7 కోట్ల దాకా పరిటాల కుటుంబం వసూలు చేసిందన్నారు. పైగా అక్కడ పరిటాల రవీంద్ర నగర్ అని బోర్డు కూడా ఏర్పాటు చేశారని, ఇప్పటికీ ఆ ఇళ్లకు చట్టబద్ధత లేదని చెప్పారు. మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్ జోక్యం చేసుకుని సరిదిద్దా లని సూచించారు. తనకు సంబంధం లేదని ఎమ్మెల్యే పరిటాల సునీత అంటే సరిపోదని, అలాంటప్పుడు జీపీఏలు రద్దు చేయమని అధికారులను కోరాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా కలెక్టర్, ప్రభుత్వం చొరవ తీసుకుని రిజిస్ట్రేషన్ రద్దు చేయించకుంటే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో 15 వేల కుటుంబాలతో కలిసి రోడ్లపైకి రావాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, పార్టీ మండల కన్వీనర్ బండి వపన్, నాయకులు భోగే గోపాల్‌రెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మఠం శ్యాంసుందర్, ఈశ్వరయ్య, నీరుగంటి నారాయణరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు వెంకటేశ్వర్లు, సందీప్‌యాదవ్, నాయకులు ఆకుల మునిశంకరయ్య, గోపాల్‌రెడ్డి, గోపి, చిరంజీవి పాల్గొన్నారు.
పరిటాల కుటుంబం అండతో 930 ఎకరాల కబ్జాకు యత్నం
ప్రజా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ‘ఈనాడు’తో కుట్ర
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి


