వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి
అనంతపురం అర్బన్: ‘‘వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా మార్చాలి. నూతన సాంకేతిక పద్ధతులు, పథకాలు, కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించాలి’’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అంశాలపై కలెక్టర్ బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఆత్మ’ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన రైతులకు కచ్చితంగా అందాలన్నారు. ప్రస్తుతం యూరియా నిల్వలకు ఇబ్బంది లేదని, భవిష్యత్తులోనూ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. మండల వ్యవసాయ అధికారులు రోజూ క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ–పంట నమోదు గడువులోగా పూర్తవ్వాలని చెప్పారు.అనంత హార్టీకల్చర్ కాంక్లేవ్‌లో ఎంఓయూ చేసుకున్న కంపెనీలు ఆ మేరకు పనిచేసేలా చూడాలన్నారు. ‘నేషనల్ బ్యాంబూ మిషన్’ లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలన్నారు.లైవ్ స్టాక్ యూనిట్ల గ్రౌండింగ్ వేగవంతం చేయాలన్నారు. జిల్లాలోని 163 ఎఫ్‌పీఓల టర్నోవర్ రూ. 3 కోట్ల మేర జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధి కారి ఉమామహేశ్వరమ్మ, ఉద్యాన శాఖ అఽధికారి ఉమాదేవి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, మార్క్‌ఫెడ్ డీఎం పెన్నేశ్వరి, ప్రకృతి వ్యవసాయం డీపీఎం లక్ష్మానాయక్, ‘ఆత్మ’ పీడీ పద్మలత తదితరులు పాల్గొన్నారు.
‘అమృత్’ వేగవంతం చేయాలి
పట్టణాల్లో అమృత్ పథకం కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రెండు నెలల వ్యవధిలో 30 వేల ఇళ్లలో హోమ్ కంపోస్ట్, రూఫ్ గార్డెన్ ఏర్పాటు లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మునిసిపాలిటీలు తమ పనితీరు మెరుగుపర్చుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చెప్పారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అమృత్ పనులు, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, పన్ను వసూళ్లు, టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు, మెప్మా పథకాల అమలుపై జిల్లాలోని మునిసిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. తాడిపత్రిలో ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. గుత్తిలో మురుగు నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు స్థలం కేటాయించాలన్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. శిల్పారామంలో ఖాళీగా ఉన్న షాపింగ్ కాంప్లెక్ గదులను ఆసక్తి ఉన్న స్వయం సహాయక బృందాలకు కేటాయించాలన్నారు. టిడ్కో లబ్ధిదారులకు ప్రస్తుతం వారు ఉన్న చిరునామా మార్పునకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తప్పనిసరిగా హోమ్ కంపోస్ట్, రూఫ్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. రెండు నెలల్లో 30 వేల ఇళ్లలో హోమ్ కంపోస్ట్, రూఫ్ గార్డ్డెన్‌లు ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో మునిసిపల్ ఆర్‌డీ నాగరాజు, నగరపాలక కమిషనర్ బాలస్వామి, మెప్మా పీడీ విశ్వజ్యోతి, కమిషనర్లు శివరామకృష్ణ, వంశీకృష్ణ భార్గవ్, దివాకర్‌రెడ్డి, టీఈలు వాసుదేవరెడ్డి, భవాని, అర్షత్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.


