రాత్రి 7 గంటలైతే మూతే!
● పెద్దపప్పూరు పీహెచ్‌సీలో దుస్థితి
పెద్దపప్పూరు: ఆ ఆసుపత్రికి రోగులు వెళ్లినా వైద్యాధికారులు ఉండరు. పేరుకే 24 గంటల ఆసుపత్రి.. కానీ రాత్రి 7 గంటలకే మూతపడుతోంది. పెద్దపప్పూరు పీహెచ్‌సీలో వైద్య సేవలు పొందడం రోగులకు గగనమైపోయింది. ఆసుపత్రికి ఇద్దరు వైద్యులను నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం ఒక్కరినే కేటాయించింది. ఆమె కూడా ఇటీవల సమ్మె బాట పట్టడం గమనార్హం. ఇక.. ఆస్పత్రిలో ఇద్దరు స్టాఫ్‌నర్సులు ఉన్నా వారు ఎప్పుడొస్తారో ఎప్పుడెళ్తారో తెలియని దుస్థితి నెలకొంది. ఆస్పత్రికి ఫార్మసిస్టును కూడా ప్రభుత్వం నియమించలేదు. ఈ క్రమంలో రోగులు చేసేదేమీ లేక ఆర్‌ఎంపీల వద్దకు క్యూ కడుతున్నారు. ఇప్పటికై నా జిల్లా వైద్యాధికారులు స్పందించి పెద్దపప్పూరు పీహెచ్‌సీపై దృష్టి సారించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
అనంతపురం మెడికల్: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి, పీహెచ్‌సీలకు వచ్చే వైద్యులకు మెరుగైన సేవలందించాలని వైద్యులను డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఈ భ్రమరాంబ దేవి ఆదేశించారు. బుధవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీహెచ్‌సీల్లో రోగులకందుతున్న సేవలపై డీఎంహెచ్‌ఓ సమీక్షించారు. వర్షాకాలంలో రోగాలు ప్రబలే అవకాశం అధికంగా ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.


