రెవెన్యూ క్రీడలు విజయవంతం చేయాలి
అనంతపురం అర్బన్: అనంతపురం కేంద్రంగా నవంబరు 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరగనున్న రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు విజయవంతం చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. క్రీడల నిర్వహణ ఏర్పాట్లు బాగుండాలని సూచించారు. రెవెన్యూ క్రీడల నిర్వహణపై కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతి ఉత్సవాలు ఆర్‌డీటీ స్టేడియంలో జరగనున్నాయన్నారు. ఆయా శాఖల ఉమ్మడి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. క్రీడాకారులకు వసతి, భోజనం, ఇతర ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు సీనియర్ ఉన్నతాధికారులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రోటోకాల్‌పై ప్రత్యేక దృష్టి ఉంచాలన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ రెవెన్యూ క్రీడల్లో పాల్గొనే ఉద్యోగులకు రాయలసీమ వంటకాల రుచి చూపాలన్నారు. క్రీడలు విజయవంతం చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. సమావేశంలో ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ జి.రామకృష్ణారెడ్డి, ఉమ్మడి జిల్లాలోని ఆర్‌డీఓలు కేశవనాయుడు, వసంతబాబు, శ్రీనివాస్, మహేష, వీవీఎస్‌శర్మ, సువర్ణ, ఆనంద్‌కుమార్, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, మల్లికార్జునరెడ్డి, రమేష్‌రెడ్డి, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు దివాకర్‌రావు, సోమశేఖర్, పరిపాలనాధికారి అలెగ్జాండర్, కో–ఆర్డినేషన్ సూపరింటెండెంట్ యుగేశ్వరిదేవి, తహసీల్దార్లు హరికుమార్, మోహన్‌రావు, బాలకిషన్ పాల్గొన్నారు.
31న యూనిటీ మార్చ్
అనంతపురం అర్బన్: జిల్లాకేంద్రంలో ఈ నెల 31 నిర్వహించనున్న సర్దార్@150 యూనిటీ మార్చ్‌ను విజయవంతం చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ పిలుపునిచ్చారు. కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో యూనిటీ మార్చ్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్దార్ వల్లబాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని యూనిటీ మార్చ్‌తో పాటు ఏక్‌భారత్ ఆత్మ నిర్వర్ భారత్ పాదయాత్ర నిర్వహించనున్నామన్నారు. యువత విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మై భారత్ ప్రోగ్రాం ఇన్‌చార్జ్ శ్రీనివాసులు, రాష్ట్రపతి అవార్డు గ్రహితలు బిసాటి జీవన్‌కుమార్, కె.జయమారుతి, యెగా మాస్టర్ మహేష్‌బాబు పాల్గొన్నారు.
5 వేల ఎకరాల్లో సోలార్ ప్రాజెక్టు
అనంతపురం అర్బన్: ‘‘కంబదూరు మండలంలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాకు అవసరమైన 5,276.81 ఎకరాల భూమిని గుర్తించాం. ఇందులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి’’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోలార్ ప్రాజెక్టుకు భూ సేకరణ అంశంపై కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు ఏర్పాటుకు 5,276.81 ఎకరాలు అవసరం కాగా 4,292.28 ఎకరాల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. వీటికి సంబంధించి లీజు అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పారు. మిగిలిన 984.53 ఎకరాలు గుర్తింపునకు సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. భూ సమస్యలు ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించాలని సూచించారు. సమస్యల రాకుండా రైతులను ఒప్పించి భూసేకరణ చేపట్టాలన్నారు. ఈ నెలాఖరులోగా భూములు గుర్తింపు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో కళ్యాణదుర్గం ఆర్‌డీఓ వసంతబాబు, భూ విభాగం సూపరింటెండెంట్ రియాజుద్ధీన్, సర్వే శాఖ ఏడీ రూప్లానాయక్, ఏపీఎస్‌జీఈఎల్ అభివృద్ధి అధికారి కిషోర్‌రెడ్డి, ఎల్‌డీఎం నరేష్‌రెడ్డి, కంబదూరు తహసీల్దారు బాలకిషన్, ఎన్‌టీపీసీ అధికారులు శివకుమార్, వినోద్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.


