ఘనంగా బాబా అవతార ప్రకటన దినోత్సవం
ఉరవకొండ: సత్యసాయి అవతార ప్రకటన దినోత్సవాన్ని సోమవారం ఉరవకొండలో ఘనంగా నిర్వహించారు. ఉదయం సత్యసాయి అవతార ప్రకటన చేసిన రాతి గుండు వద్ద నిర్వహించిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సత్యసాయి చిత్రపటాన్ని ప్రత్యేక వాహనంపై పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం సత్యసాయి సేవా సమితి అధ్వర్యంలో భక్తులకు అన్నదానం, వస్ర వితరణ చేశారు.
పీఏబీఆర్‌లో కొనసాగుతున్న మరమ్మతులు
కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) జలవిద్యుత్ ఉత్పత్తి కేందంలో గేట్ లింక్ మరమ్మతులు కొనసాగుతున్నాయి. మంగళవారం చేపట్టిన పనులను ఇరిగేషన్ డీఈఈ వెంకటరమణ పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 9 రోజుల క్రితం గేట్ లింక్ దెబ్బ తినడంతో జల విద్యుత్ ఉత్పత్తి నిలిపి వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం లింక్ ఛానెల్ ద్వారా 40 క్యూసెక్కులు, హంద్రీనీవా ద్వారా 60 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందన్నారు. అలాగే తాగునీటి ప్రాజెక్టులకు 55 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 25, కుడి కాలువకు లీకేజీ 35, జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద లీకేజీ 130 క్యూసెక్కుల చొప్పున అవుట్ ఫ్లో ఉందన్నారు. డ్యాంలో ప్రస్తుతం 5.386 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.
కసాపురంలో ఘనంగా లక్ష్మీపూజ
గుంతకల్లు రూరల్: దీపావళి సందర్భంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో సోమవారం సాయంత్రం లక్ష్మీపూజను ఘనంగా నిర్వహించారు. ఆలయ ముఖ మంటపంలో సీతాదేవి అమ్మవారిని ధనలక్ష్మీగా కొలువుదీర్చి పూజించారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ముగ్గురు డాక్టర్లకు ‘షోకాజ్’
గుత్తి: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న ముగ్గురు డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యల్లప్ప మంగళవారం వెల్లడించారు. ఎలాంటి అనుమతి లేకుండా సోమవారం డాక్టర్లు పవిత్ర, రమ్యశ్రీ, రాజేష్ సెలవులో వెళ్లారని, దీంతో వైద్య సేవలకు అంతరాయం కలిగినట్లు వివరించారు. అనుమతి లేకుండా సెలవులో వెళ్లినందుకు వారి మెయిల్, వాట్సాప్ నంబర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. నిర్ణీత గడువులోపు సమాధానం ఇవ్వకపోతే వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
ఘనంగా బాబా అవతార ప్రకటన దినోత్సవం


