విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
రాప్తాడు: విద్యుత్ షాక్‌కు గురై ఓ కార్మికుడు మృతి చెందాడు. రాప్తాడులోని ఆటో నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు... అనంతపురంలోని ఆజాద్ నగర్‌లో నివాసముంటున్న షేక్ ఫకృద్ధీన్ (55)కు భార్యతో పాటు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆటో నగర్‌లో వెడ్డింగ్, డ్రిల్లింగ్ వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ నేపథ్యంలో ఆటోనగర్‌లోని సాయిరంగా ఏజెన్సీస్ నిర్వహిస్తున్న 21వ షాపు వర్షానికి కారుతుండడంతో పైన రేకులు వేసే పనిని ఫకృద్ధీన్‌కు యజమాని గంగాధర్ అప్పగించాడు. దీంతో మంగళవారం మరో వ్యక్తి జాఫర్‌తో కలసి పనిలో నిమగ్నమైన ఫకృద్ధీన్.. రేకులకు డ్రిల్లింగ్ చేస్తుండగా విద్యుత్ ప్రసరించి షాక్‌కు గురై కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గుంతకల్లు టౌన్: పట్టణంలోని ఆలూరు రోడ్డులో నివాసముంటున్న ముల్లా షెక్షావలి (28) విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. బేల్దారి పనులతో జీవనం సాగిస్తున్న షెక్షావలికి ఏడాదిన్నర క్రితం ఆదోనికి చెందిన ఫరీదాతో వివాహమైంది. మంగళవారం సాయంత్రం గేదెల కోసమని తన ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో చుట్టూ బండలు పాతి, రేకులు బిగించేందుకు ఎలక్ట్రికల్ డ్రిల్లింగ్ మిషన్‌తో రంధ్రాలు వేస్తున్న సమయంలో షాక్‌కు గురై షెడ్డుపై నుంచి కింద పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మనోహర్ తెలిపారు.
రెండిళ్లలో చోరీ
గుమ్మఘట్ట: మండలంలోని గోనబావి క్రాస్‌లో నివాసముంటున్న మారెప్ప, చౌడప్ప ఇళ్లలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. కూలి పనుల కోసం ఇళ్లకు తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి బెంగళూరుకు మారెప్ప, మైసూరుకు చౌడప్ప వలస వెళ్లారు. తాళం వేసిన ఇళ్లను గుర్తించిన దుండగులు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తాళాలు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. మంగళవారం ఉదయం విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారి సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఇంటి యజమానులకు సమాచారం అందించారు. మారెప్ప ఇంట్లో 3 తులాల బంగారు ఆభరణాలు, చౌడప్ప ఇంట్లో నాలుగు తులాల బంగారు ఆభరణాలు అపహరించినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణ అయింది. బాధితుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లుపోలీసులు పేర్కొన్నారు.
విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి


