గుత్తిలో కల్తీ పెట్రోల్ కలకలం
● పోలీసులు, రెవెన్యూ అధికారులకు బాధితుడి ఫిర్యాదు
గుత్తి: స్థానిక గాంధీ సర్కిల్ సమీపంలోని పరమేశ్వరయ్య పెట్రోల్ బంక్‌లో కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారని గుత్తికి చెందిన యువకుడు చంద్రశేఖర్ ఫిర్యాదుతో మంగళవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. వివరాలు.. మంగళవారం ఉదయం చంద్రశేఖర్ రూ.100 విలువైన పెట్రోలును ఓ బాటిల్‌లో పోయించుకున్నాడు. అయితే పెట్రోల్ నాణ్యతలో తేడాను గమనించిన అతను వెంటనే సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాడు. వారు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్‌ఐ సురేష్, డీటీ సూర్యనారాయణ, సీఎస్‌డీటీ ప్రవీణ్‌కుమార్, వీఆర్వో సుధాకర్ రెడ్డి తదితరులు అక్కడకు చేరుకుని పెట్రోల్‌ను పరిశీలించారు. నాలుగు బాటిళ్లలో సేకరించిన సాంపిల్స్‌తో పాటు చంద్రశేఖర్ వద్ద ఉన్న బాటిల్ పెట్రోల్‌ను సీజ్ చేసి అనంతపురంలోని ల్యాబ్‌కు పంపారు. ఘటనపై సీఎస్‌డీటీ ప్రవీణ్‌కుమార్, డీటీ సూర్యనారాయణ మాట్లాడుతూ... పెట్రోల్‌లో నాణ్యతను గుర్తించేందుకు సాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. ల్యాబ్ నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అయితే కల్తీ పెట్రోల్ ఘటనపై సుమారు రెండు గంటల పాటు వివాదం నెలకొంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు రెండు సార్లు పెట్రోల్ బంక్‌కు వచ్చారు. బాధితున్ని, పెట్రోల్ బంక్ సిబ్బందిని విచారించారు. ఎలాంటి కల్తీ పెట్రోల్ అమ్మడం లేదని నిర్వాహకులు తెలిపారు.


