రైలు కిందపడి యువకుడికి గాయాలు
గుత్తి: కదులుతున్న రైలు నుంచి దిగబోతూ ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు. కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన వీరేష్ రెండు రోజుల క్రితం తిరుపతి వెళ్లాడు. సోమవారం సాయంత్రం తిరుపతిలో రైలు ఎక్కి మంగళవారం వేకువజాము 2.30 గంటలకు తాను దిగాల్సిన గుత్తికి చేరుకున్నారు. అయితే నిద్రమత్తులో గుత్తికి రైలు చేరుకున్న విషయాన్ని గుర్తించలేకపోయాడు. పక్కన ఉన్న వారు నిద్ర లేపడంతో అప్పటికే కదులుతున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పట్టు తప్పి రైలు కిందపడడంతో ఒక కాలు నుజ్జునుజ్జయింది. రైల్వే పోలీసులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ
సబబు కాదు
● మాజీ విప్ వెన్నపూస గోపాలరెడ్డి
అనంతపురం: ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 17 మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ సబబు కాదని కూటమి ప్రభుత్వానికి శాసనమండలి మాజీ విప్ వెన్నపూస గోపాలరెడ్డి హితవు పలికారు. వైద్య కళాశాల ప్రైవేటీ కరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కోటిసంతకాల సేకరణ కార్యక్రమంలో మంగళవారం ఆయన సంతకం చేసి, మాట్లాడారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ రమణ, నాయకులు ప్రభాకర్, ఆదినారాయణ చౌదరి, మాజీ ఎన్‌జీఓ నాయకులు ఓబుళరావు, కొండారెడ్డి, శ్రీనివాసరెడ్డి, హరినాథరెడ్డి, ప్రకాష్, విశ్వేశ్వరరెడ్డి, చెన్నకేశవులు పాల్గొన్నారు.


