
వీడిన మిస్సింగ్ మిస్టరీ
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం కొడిమి దర్గా కొట్టాలకు చెందిన బాలుడి మిస్సింగ్ మిస్టరీ వీడింది. ఈ నెల 12న అదృశ్యమైన బాలుడి ఆచూకీ ఆరు రోజులైనా లభ్యం కాకపోవడంపై ‘వీడని మిస్సింగ్ మిస్టరీ’ శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం వెలువడిన కథనంపై పోలీసులు స్పందించారు. వివరాలను అనంతపురం రూరల్ సీఐ శేఖర్ వెల్లడించారు. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల సమయంలో బాలుడు అదృశ్యమయ్యాడు. 12న కేసు నమోదు చేశామన్నారు. వజ్రకరూరు మండలం కమలపాడులో రామాంజనేయులు అనే వ్యక్తి ఇంటి వద్ద ఉన్నాడనే సమాచారంతో పోలీసులు అక్కడకెళ్లి బాలుడిని గుర్తించి ఆధీనంలోకి తీసుకున్నారు. శుక్రవారం తల్లిదండ్రులకు అప్పగించారు.
ముగిసిన జిల్లా స్థాయి సైన్స్ సెమినార్
అనంతపురం సిటీ: స్థానిక సైన్స్ సెంటర్‌లో జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ శుక్రవారం ముగిసింది. మొత్తం 32 మండలాల నుంచి 46 మంది విద్యార్థులు హాజరు కాగా, తాడిపత్రి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని హాజియా తబ్సూమ్ ప్రథమ స్థానం, గుంతకల్లు రైల్వే హైస్కూల్ విద్యార్థి ఉదిత్ రెండో స్థానంలో నిలిచారు. వీరిని విజయవాడలో శనివారం జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు జిల్లా సైన్స్ అధికారి బాలమురళీకృష్ణ, ఎన్‌జీసీ రీజనల్ కో–ఆర్డినేటర్ ఆనంద భాస్కర్‌రెడ్డి తెలిపారు. న్యాయ నిర్ణేతలుగా ఆర్ట్స్ కాలేజ్ అధ్యాపకుడు డా.కిశోర్, డా.చంద్రశేఖర్ వ్యవహరించారు.

వీడిన మిస్సింగ్ మిస్టరీ