
డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి
అనంతపురం అర్బన్: తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ గురువారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 37 మంది తహసీల్దార్లకు పదోన్నతి కల్పించగా ఇందులో జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నారు. పదోన్నతి పొందిన వారిలో ఉరవకొండ తహసీల్దారుగా ఉంటూ కూడేరు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న ఎస్‌కే మహబూబ్‌బాషా, రాయదుర్గం తహసీల్దారు జి.నాగరాజు ఉన్నారు. పోస్టింగ్ ఇచ్చేంత వరకూ వారు ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగనున్నట్లు సమాచారం.
వృద్ధాశ్రమం కోసం జోలె పట్టిన రామ్‌లక్ష్మణ్
శింగనమల(నార్పల): వృద్ధాశ్రమానికి తమ వంతు సాయంగా జోలె పట్టి చందాలు సేకరించారు ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్. వివరాలు.. నార్పల మండలం కురగానిపల్లిలో చంద్రశేఖర్ రెడ్డి, స్రవంతి దంపతులు చెన్నకేశవ వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారి నిస్వార్థ సేవలను గుర్తించిన రామ్, లక్ష్మణ్ శుక్రవారం నేరుగా కురగానిపల్లిలోని వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. వృద్ధులతో మాట్లాడారు. వారి సాధక బాధలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నార్పలలో జోలె పట్టి చందాలు ఆర్థించారు. అనాథ వృద్ధులను చేరదీసి వారి ఆలనా పాలనా చూస్తున్న వారికి బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు గవ్వల శివశంకర్, కేఎల్‌ఎన్ ప్రసాద్, ఈడిగ శ్రీధర్, చంద్ర, లక్ష్మీనారాయణ, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.