
రైలు ఢీకొని వివాహిత మృతి
యాడికి: రైలు ఢీకొని ఓ వివాహిత మృతి చెందింది. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. యాడికి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన కురుబ దస్తగిరి, మద్దిలేటమ్మ (40) దంపతులకు పదో తరగతి చదువుతున్న ఓ కుమారుడు ఉన్నాడు. మతి స్థిమితం లేకుండా బాధపడుతున్న మద్దిలేటమ్మ గురువారం ఉదయం దస్తగిరి తోటకు వెళ్లిన సమయంలో నెమ్మదిగా రైలు పట్టాలపై చేరుకుని అటూఇటు తిరుగుతుండగా రైలు ఢీకొంది. ఘటనలో శరీరం ఛిద్రమైంది. సమాచారం అందుకున్న గుత్తి రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.
నిర్వాసితులకు న్యాయం చేస్తాం : కలెక్టర్
తాడిపత్రి రూరల్: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు, స్థలాలు, ఇళ్లను కోల్పోయిన వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని కలెక్టర్ ఓ.ఆనంద్ భరోసానిచ్చారు. గురువారం తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి, రావివెంకటాంపల్లి, చల్లవారిపల్లి, పులి ప్రొద్దుటూరు గ్రామాల పరిధిలో చేపట్టిన 544డీ జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తమకు పరిహారం పంపిణీలో అన్యాయం జరిగిందంటూ పలుమార్లు రోడ్డు పనులను నిర్వాసితులు అడ్డుకుంటూ వచ్చారు. దీంతో గురువారం కలెక్టర్ ఆయా ప్రాంతాల్లో పర్యటించి నిర్వాసితులతో మాట్లాడారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ కేశవనాయుడు, తహసీల్దార్ సోమశేఖర్, హైవే ఇంజనీర్లు ఉన్నారు.
‘తమ్ముడా మజాకా’పై కలెక్టర్ సీరియస్
రాప్తాడు రూరల్: టీడీపీ అనుబంధ టీఎన్‌టీయూసీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు తాడాల నాగభూషణం మానసిక వికలాంగ కోటాలో అక్రమంగా పింఛన్ పొందుతున్న వైనంపై ‘తమ్ముడా మజాకా’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై అనంతపురం కలెక్టర్ ఓ.ఆనంద్ స్పందించారు. అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో నివాసముంటున్న తాడాల నాగభూషణం పదేళ్లుగా ఈ పింఛన్ పొందుతున్నాడు. ఇప్పటి వరకూ పింఛన్లు పొందుతున్న వందశాతం వైకల్యం ఉన్న వేలాదిమంది దివ్యాంగులకు ఇటీవల నోటీసులు జారీ చేసిన కూటమి ప్రభుత్వం ... నాగభూషణం కు ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెవడంతో గుర్తించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో విచారణలో భాగంగా నోటీసు జారీ చేస్తామని ఎంపీడీఓ దివాకర్ పేర్కొన్నారు.

రైలు ఢీకొని వివాహిత మృతి