
ఇష్టారాజ్యం..ఈ–స్టాంప్‌ల విక్రయం
● అధిక ధరకు విక్రయిస్తున్నా పట్టించుకోని అధికారులు
అనంతపురం టౌన్: ఉమ్మడి జిల్లాలో ఈ– స్టాంప్‌లను ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో మొత్తం 21 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా 200 మందికి పైగా స్టాంప్ వెండర్లు ఉండగా ఇందులో ఒక్క అనంతపురంలోనే దాదాపు 40 మందికి పైగా ఉండడం గమనార్హం. వీరు కర్నూలులోని స్టాక్ హోల్డింగ్ సంస్థకు ఇండెంట్ పంపి.. ఈ–స్టాంప్ విక్రయాన్ని చేపడుతున్నారు. ప్రతి స్టాంప్ విక్రయంపై వెండర్లకు ప్రత్యేకంగా కమీషన్ ఉంటుంది. ఇది చాలదన్నట్లు ప్రతి స్టాంప్‌పై అదనపు సొమ్ము వసూలు చేస్తున్నారు. రూ.100 స్టాంప్ కావాలంటే రూ.150 చెల్లించుకోవాల్సి వస్తుండడంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వెండర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
రిజిస్ట్రేషన్ శాఖలో స్టాంపుల కొరత:
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను స్టాంపుల కొరత వేధిస్తోంది. కొన్ని నెలలుగా స్టాంపుల స్టాక్ లేదు. కేవలం స్టాంపుల విక్రయం ద్వారానే ప్రతి నెలా రిజిస్ట్రేషన్ శాఖకు రూ.కోట్లలో ఆదాయం ఉండేది. ప్రస్తుతం స్టాంపులు అందుబాటులో లేకపోవడంతో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి గండిపడింది.