
అన్యాయం.. అప్రజాస్వామికం
అనంతపురం: ఇటీవల రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ఈ వ్యవహారంలో నిజాలు నిగ్గుతేల్చేలా ‘సాక్షి’లో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వ వైఫల్యాలను ‘సాక్షి’ ఎత్తి చూపుతోందనే అక్కసుతో సర్కారు పెద్దలు రెచ్చిపోతున్నారు.పోలీసుల సాయంతో ప్రజా గొంతుకగా ఉండే ‘సాక్షి’ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అయితే, ప్రజల పక్షాన నిలుస్తున్న జర్నలిస్టుల గొంతును నొక్కేసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికమని జర్నలిస్టు సంఘాల నేతలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. కక్షసాధింపు చర్యలు, అణచివేత విధానాలకు పాల్పడడం, అక్రమ కేసులు పెట్టడం సరి కాదంటున్నారు.
వాస్తవాలు తెలియజేయడమే నేరమా?
ప్రజలకు నిజాలు చెప్పడం మీడియా కర్తవ్యం. అలా చేయయడమే నేరమని ప్రభుత్వం భావిస్తోంది. పత్రికా స్వేచ్ఛను హరించిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేదని చరిత్ర చెబుతోంది. ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
– రాచమల్లు భోగేశ్వర రెడ్డి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవాధ్యక్షుడు
ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి
‘సాక్షి’ గొంతునొక్కే చర్యను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి. పత్రికా స్వేచ్ఛను ఖూనీ చేయాలని చూస్తే సహించబోం. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా పిలువబడే మీడియాపై దాడులు చేయడం పిరికిపంద చర్య. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా పత్రికా విలువలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది.
– కేపీ కుమార్, ఏపీయూడబ్ల్యూజే
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
ప్రభుత్వ తీరు సరికాదు
జర్నలిస్టులు వారికి అందిన సమాచారం ప్రకారం వార్తలు రాస్తుంటారు. నకిలీ మద్యం గురించి ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరించి విచారణ చేయించాల్సిన అవసరం ఉంది. అంతేకానీ వార్తలు రాసిన జర్నలిస్టులు లేదా పత్రికా ఎడిటర్, యాజమాన్యాలకు నోటీసులు ఇవ్వడం సరికాదు. దీన్ని జర్నలిస్టులను బెదిరించే ధోరణిగా భావించాల్సి ఉంటుంది.
– రేపటి రామాంజినేయులు,
ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి

అన్యాయం.. అప్రజాస్వామికం

అన్యాయం.. అప్రజాస్వామికం

అన్యాయం.. అప్రజాస్వామికం