
ఏసీబీ వలలో సీనియర్ ఆడిటర్
● రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.8 వేలు లంచం తీసుకుంటూ దొరికిన వైనం
అనంతపురం టవర్‌క్లాక్: జిల్లా ఆడిట్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ ఆడిటర్ లక్ష్మీనారాయణ, పార్ట్ టైమ్ స్వీపర్ నూర్ మహమ్మద్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. బుధవారం ఓ రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కలెక్టరేట్ సమీపంలోని రాజేంద్ర మునిసిపల్ హైస్కూల్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేసిన బుల్లె శ్రీనివాసులు ఈ ఏడాది మే 31న ఉద్యోగ విరమణ చేశారు. పెన్షన్ కోసం జిల్లా పరిషత్ ప్రాంగణంలోని ఆడిట్ శాఖ కార్యాలయంలో సంప్రదించారు. ఫైలు పెట్టడానికి సీనియర్ ఆడిటర్ లక్ష్మీనారాయణ రూ.10 వేలు లంచం డిమాండ్ చేశారు. చివరకు రూ.8 వేలకు ఒప్పుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు బుల్లె శ్రీనివాసులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ కర్నూలు డీఎస్పీ సోమన్న నేతృత్వంలో ఏసీబీ అధికారులు వల పన్నారు. ఇందులో భాగంగా బాధితుడు బుధవారం లంచం డబ్బు తీసుకుని ఆడిట్ కార్యాలయానికి వెళ్లారు. సీనియర్ ఆడిటర్‌కు ఇవ్వబోగా.. స్వీపర్ నూర్ చేతికి ఇవ్వాలని సూచించారు. అతను డబ్బు తీసుకుంటున్న సమయంలోనే ఏసీబీ అధికారులు దాడి చేశారు. సీనియర్ ఆడిటర్ లక్ష్మీనారాయణ, స్వీపర్ నూర్‌ను అరెస్టు చేసి కర్నూలు ఏసీబీ కోర్టుకు తరలించారు.
‘అదనపు’ బాధ్యతలు
నిర్వర్తించలేం
● జేడీఏతో మొరపెట్టుకున్న ఏఈవోలు
అనంతపురం అగ్రికల్చర్: ఈ–క్రాప్ గురించి వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) బుధవారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మను కలిశారు. తక్కువగా ఈ–క్రాప్ నమోదయిన మండలాలు, గ్రామాలకు తమను నియమించడం పట్ల అభ్యంతరం తెలిపారు.ఉన్నఫళంగా కొత్త ప్రాంతాలకు వెళ్లి ఈ–క్రాప్ చేయడం కష్టమని చెప్పారు. ఈ నెల 25లోపు ఈ–క్రాప్ పూర్తి చేయాలనే నిబంధన పెట్టారని, ఇంత తక్కువ సమయంలో తమ వల్ల కూడా కాదని అన్నారు. ఆయా మండలాల్లోని ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లకే అప్పగించాలని కోరారు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పనిసరిగా అదనపు బాధ్యతలు తీసుకుంటేనే గడువులోపు ఈ–క్రాప్ పూర్తవుతుందని జేడీఏ తెలిపారు. అక్కడికి వెళ్లడం తప్ప మరో మార్గం లేదని తేల్చిచెప్పారు.