
మరీ ఇంత నిర్లక్ష్యమా?
● సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యంపై కలెక్టర్ ఆనంద్ ఫైర్
అనంతపురం మెడికల్: ‘ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఏడాదిలో 69 వేల మంది రోగులు వైద్యం పొందగా అందులో కేవలం 29 వేల మందిని ఎన్‌టీఆర్ వైద్య సేవల కింద నమోదు చేశారు. కనీసం ఆస్పత్రికి వచ్చిన వారిలో 50 శాతం మందిని కూడా నమోదు చేయకపోవడమేంటి? హెచ్‌డీఎస్‌లో రూ.1.7 కోట్లు ఉంటే రూ.10 కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తారా..? ఎన్‌టీఆర్ వైద్య సేవ, అబా రిజిస్ట్రేషన్‌లోనూ ఎంతో వెనుకబడ్డారు. మరీ ఇంత నిర్లక్ష్యమైతే ఎలా’ అంటూ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్రహ్మణ్యంపై కలెక్టర్ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కలెక్టర్ అధ్యక్షతన హెచ్‌డీఎస్ (హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందుబాటులో ఉన్న నిధులతో ఏవి అత్యవసరమో వాటినే అజెండాలో చేర్చాలి కానీ అందరూ ఇచ్చిన వాటిని నమోదు చేయడం సరికాదన్నారు. అబా రిజిస్ట్రేషన్ కేవలం 50 శాతమే నమోదైనట్లు లెక్కల్లో చూపుతున్నారని, ఏళ్లు గడుస్తున్నా అందులో పురోగతి ఉండదా అని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సౌజన్య కుమార్‌ను కలెక్టర్ ప్రశ్నించగా ఆయన నీళ్లు నమిలారు. ఏసీలు కొనుగోలు చేయడంతో పాటు నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోగులకందే సేవల్లో నాణ్యత పెంచాలన్నారు. బయోవేస్టేజ్‌ను సరిగా తీసుకెళ్లకపోవడంతో ఇన్‌ఫెక్షన్స్ సోకే ప్రమాదం లేకపోలేదని హెచ్‌డీఎస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి 50 వీల్‌చైర్లను అందిస్తామని హెచ్‌డీఎస్ సభ్యుడు రమణ తెలిపారు. సమావేశంలో హెచ్‌డీఎస్ కో చైర్మన్లు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ భ్రమరాంబ దేవి, డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ హేమలత, ఎన్‌టీఆర్ వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ కిరణ్‌కుమార్ రెడ్డి, సూపర్ స్పెషాలిటీ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ బెన్‌డెక్ట్, హెచ్‌డీఎస్ సభ్యులు విశాల ఫెర్రర్ పాల్గొన్నారు.
కలెక్టర్, ఎమ్మెల్యేను అడ్డుకున్న కార్మికులు..
తమకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదంటూ సర్వజనాస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తించే పారిశుధ్య కార్మికులు స్పష్టం చేశారు. కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ముందు వారు అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీనా.. టీడీపీనా అంటూ నూతన ఏజెన్సీ నిర్వాహకులు తమకు ముచ్చెమటలు పట్టిస్తున్నారని వాపోయారు. అరగంట పాటు వారిని కదలనివ్వలేదు.