
నమ్మబలికి.. నిరాశ మిగిల్చి
శింగనమల: మండలంలోని రాచేపల్లి వద్ద ఉన్న లెదర్ పార్క్ పునఃప్రారంభం కలగానే మారి పోయింది. తమ ప్రభుత్వం రాగానే ప్రారంభి స్తామని చెప్పిన ప్రజాప్రతినిధులు మాట తప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే లెదర్క్ పార్క్‌ను ప్రజాప్రతినిధులు పరిశీలించారు. త్వరలో ప్రారంభిస్తామంటూ నిరుద్యోగుల్లో లేని ఆశలు కల్పించారు. ఉపాధి కల్పించి వలసలు నివారిస్తామంటూ డప్పు కొట్టుకున్నారు. ఇది జరిగి నేటికి ఏడాదిన్నరవుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి చర్యలూ కానరావడంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఓట్లు దండుకునేందుకే..
2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం శింగనమల మండలంలోని రాచేపల్లి వద్ద 52 ఎకరాల్లో లెదర్ పార్క్ ఏర్పాటు చేసింది. అప్పట్లో 15 మందికి చెన్త్నెలో శిక్షణ ఇచ్చారు. ఆ తరువాత 2003–2004 సమయంలో అనంతపురంలోని అంబేడ్కర్ భవనంలో కొంత మందికి శిక్షణ ఇచ్చారు. 2006–2008 మధ్యలో రాచేపల్లిలోని లెదర్ పార్క్ భవనంలోనూ శిక్షణ నిచ్చారు. లెదర్ చెప్పులు, లెదర్ బ్యాగులు, బెల్టులు తయారీలో తర్ఫీదునందించారు. అప్పట్లో శిక్షణ పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు చెందిన వారు 1,500 మందికి దాకా ఉన్నారు. ఆ తర్వాత పలు కారణాలతో లెదర్ పార్కు మూతపడింది. ఈ క్రమంలోనే గత ఎన్నికల ముందు లెదర్ పార్క్‌ను ఎన్నికల అస్త్రంగా ‘టీడీపీ’ ఉపయోగించుకుంది. నిరుద్యోగుల ఓట్లు దండుకునేందుకు లేని ఆశలు కల్పించింది. కానీ నేటికీ లెదర్ పార్క్‌ను ప్రారంభించకపోవడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.
శింగనమల మండలం రాచేపల్లిలో ప్రారంభం కాని లెదర్ పార్క్
కూటమి ప్రభుత్వం వచ్చాక
హడావుడి చేసిన ప్రజాప్రతినిధులు
నేటికీ పట్టించుకోని వైనం