
ఓటమి.. భవిష్యత్తు గెలుపునకు నాంది
● రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల ప్రారంభోత్సవంలో వక్తలు
బత్తలపల్లి: ఓటమి భవిష్యత్తు గెలుపునకు నాంది కావాలని, ఆ దిశగా ప్రతి క్రీడాకారుడు శ్రమించాలని వక్తలు పిలుపునిచ్చారు. బత్తలపల్లి మండలం రామాపురంలోని జెడ్పీహెచ్‌ఎస్ మైదానంలో రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల 10వ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులు పాటు ఈ పోటీలు జరగనున్నాయి. రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడారు. అనంతరం జరిగిన పోటీల్లో బాలుర విభాగంలో తూర్పు గోదావరి జిల్లా జట్టుపై ప్రకాశం జట్టు, విజయనగరం జట్టుపై అనంతపురం జట్టు విజయం సాధించాయి. అలాగే బాలికల విభాగంలో నెల్లూరుపై శ్రీకాకుళం జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్, మౌలిక వసతుల డైరెక్టర్ గోనుగుంట్ల విజయ్‌కుమార్, ధర్మవరం మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ అయ్యప్పనాయుడు, ప్రధానోపాధ్యాయులు వెంకటనాయుడు, రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ ప్రెసిడెంట్ విజయశంకర్‌రెడ్డి, చైర్మన్ వెంకట్రావు, జనరల్ సెక్రటరీ బాలాజి, డైట్ ప్రిన్సిపాల్ రామకృష్ణ, జిల్లా బాల్ బ్యాడ్మింటన్ ప్రెసిడెంట్ ఈశ్వరయ్య, జనరల్ సెక్రటరీ వెంకటేష్, ఫిజికల్ డైరెక్టర్ తలారి లక్ష్మీనారాయణ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
రోడ్డు పాలైన నవజాత శిశువు
కళ్యాణదుర్గం: పేగు తెంచుకుని పుట్టిన ఆ ఆడబిడ్డ ఏ తల్లికి భారమైందో ఏమో.. తెలియదు కానీ ప్రపంచంలోకి అడుగు పెట్టిన మరుక్షణమే రోడ్డు పక్కన ముళ్ల పొదల్లోకి చేరింది. శిశువు ఏడుపు విన్న స్థానికులు వెంటనే చేరదీశారు. కళ్యాణదుర్గం పట్టణ సమీపంలోని ధర్మవరం రోడ్డులో ఉన్న గ్యాస్ గోడౌన్ సమీపంలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న సీఐ యువరాజ్, మహిళా కానిస్టేబుళ్లు అక్కడకు చేరుకుని ఆరా తీశారు. శిశువును స్థానిక ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల నుంచి సమాచారం అందుకున్న ఐసీడీఎస్ సీడీపీఓ లక్ష్మీప్రసన్న, సిబ్బందితో కలిసి శుక్రవారం ఉదయం ఆర్డీటీ ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న నవజాత శిశువు ఆరోగ్యంపై స్థానిక వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఓటమి.. భవిష్యత్తు గెలుపునకు నాంది