
ప్రమాదకరం.. విద్యార్థుల ప్రయాణం
శింగనమల: చిన్నపాటి వర్షం కురిస్తే చాలు శింగనమల మండలం తరిమెల – కల్లుమడి గ్రామాల మధ్య ఉన్న పులుసు వంక ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ వంకపై బ్రిడ్జి ఎత్తు పెంచాలని పలుమార్లు కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరిమెల, కల్లుమడి గ్రామాల మధ్య రాకపోకలు సాగించాలంటే ఈ మార్గం తప్ప మరొకటి లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల కురిసిన వర్షానికి వంక బ్రిడ్జిపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. కొన్ని రోజులుగా విద్యార్థులు అతి కష్టంపై ప్రవాహాన్ని దాటుకుని పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి బ్రిడ్జి ఎత్తు పెంచేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు భాస్కర్, రామాంజనేయులు కోరుతున్నారు.